Nirmala Sitaraman | నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వం ముందు ఉన్న అతిపెద్ద సవాల్ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పలువురు యువకులు డిగ్రీ పట్టా సర్టిఫికెట్లతో బయటకు వస్తున్నా, వారి అర్హతలకు, సాధించిన ఉద్యోగాలకు వ్యత్యాసం ఉందని భావిస్తున్నారని చెప్పారు. ఆ లోటు భర్తీ చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి టెక్నాలజీలో నైపుణ్యం పెంచేందుకు యువతను సిద్ధం చేస్తున్నట్లు కొలంబియా యూనివర్సిటీలో జరిగిన సదస్సులో చెప్పారు.
ప్రపంచ దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్నా నూతన వృద్ధి అవకాశాలను భారత్ మెరుగ్గా అంది పుచ్చుకుంటున్నదని నిర్మలా సీతారామన్ చెప్పారు. వస్తువులు, సేవల విభాగాల్లో పలు దేశాలకు భారత్ కీలక భాగస్వామిగా మారాలని భావిస్తున్నట్లు తెలిపారు. దేశీయంగా సమర్ధత పెంచుకోవడంతోపాటు బాహ్య సవాళ్లను తట్టుకునేందుకు ధీటుగా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దాలని యోచిస్తున్నామని చెప్పారు. భారత్ ఆర్థిక వ్యవస్థ ఏటీఎం కార్డుల నుంచి క్యూఆర్ కోడ్ కు వేగంగా మారిందని, దేశంలో ప్రస్తుతం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) చెల్లింపులు బాగా పెరిగాయన్నారు.