న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Trump-Zelensky) మధ్య.. వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌజ్‌లో జరిగిన భేటీ వాగ్వాదానికి దారి తీసింది. ఓవల్ ఆఫీసులో ఆ ఇద్దరు నేతలు మీడియా ముందే చిర్రుబురులాడుకున్నారు. ఖనిజాలపై ఒప్పందం చేసుకునేందుకు దౌత్యపరమైన పర్యటన చేపట్టిన జెలెన్స్కీ.. ఆ ఒప్పందం కుదుర్చుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. విభిన్న అంశాలపై ట్రంప్, జెలెన్స్కీ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. రూమ్ అంతా నిండిన మీడియా ముందే ఆ ఇద్దరు నేతలు మాటల యుద్ధం కొనసాగింది. ఆ తర్వాత వైట్‌హౌజ్‌ను వీడి జెలెన్స్కీ వెళ్లిపోయారు. జెలెన్స్కీకి శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఉద్దేశం లేదని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్‌తో వాగ్వాదం తర్వాత.. అమెరికా మీడియా సంస్థ ఫాక్స్ న్యూస్‌కు వెళ్లి జెలెన్స్కీ ఇంటర్వ్యూ ఇచ్చారు.
వైట్‌హౌజ్‌లో తన ప్రవర్తనను సమర్థించుకున్నారు జెలెన్స్కీ. చెడు చేయలేదన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. ఫాక్స్ న్యూస్ యాంకర్ అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. అమెరికా ప్రజల్ని అమర్యాదపరిచారా, మీరేమైనా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నలను జెలెన్స్కీ దాటవేశారు. తన పర్యటన పట్ల అమెరికా చేసిన ఏర్పాట్లను జెలెన్స్కీ ప్రశంసించారు. వ్యూహాత్మక భాగస్వామ్యుల మధ్య చాలా గాఢమైన చర్చలు అవసరం అని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా హుందాగా, నిజాయితీగా ఉండాలని, ఒకర్ని ఒకరు అర్థం చేసుకోవాలన్నారు.
🚨 #BREAKING: Zelensky refuses MULTIPLE TIMES to apologize to President Trump after disrespecting him and our country in the Oval Office
GO HOME, Zelensky.
Your time is over. We’re done with you. pic.twitter.com/GMvrYMcqu5
— Nick Sortor (@nicksortor) February 28, 2025
అగౌరవపరిచారా, క్షమాపణలు చెబుతారా అని యాంకర్ మరో సారి అడగ్గా.. తానేమీ తప్పు చేయలేదని జెలెన్స్కీ తెలిపారు. అమెరికా అధ్యక్షుడిని గౌరవిస్తానని, అమెరికా ప్రజల్ని కూడా గౌరవిస్తున్నట్లు చెప్పారు. తామేమీ చెడు చేయలేదని ఆయన అన్నారు. కొన్ని అంశాలను ప్రైవేటుగా చర్చించాల్సి ఉంటుందన్నారు. అయితే ప్రైవేటుగా ట్రంప్‌కు క్షమాపణలు చెబుతారా లేదా అన్న అంశంపై క్లారిటీ లేదు.
ఓవల్ ఆఫీసులోనే అమెరికాను అమర్యాదపరిచారని, ఒకవేళ శాంతి స్థాపనకు సుముఖంగా ఉంటే జెలెన్స్కీ మళ్లీ రావచ్చు అని ట్రంప్ ఓ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభంపై శాంతియుత తీర్మానం చేయాలని అమెరికా భావిస్తున్నదని, కానీ ఆ సంక్షోభంలో అమెరికా పాత్ర సుదీర్ఘకాలం ఉండాలని జెలెన్స్కీ భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. తాము శాంతి కోసం చూస్తున్నామని, శక్తివంతమైన దేశంతో ఒప్పందం కుదుర్చుకుని, శాంతి బాట వీడాలనుకుంటున్నారని, పదేళ్ల యుద్ధాన్ని తాము ఆశించడంలేదని, సంతకం చేస్తే, యుద్ధం కొనసాగించాలని జెలెన్స్కీ ఆలోచిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.