మాస్కో, జనవరి 5: రష్యాతో జరుగుతున్న భీకర యుద్ధంలో ఉక్రెయిన్ బలగాలు మెల్లగా పుంజుకుంటున్నాయి. రష్యా ఆధీనంలోని ‘కుర్స్’ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లోకి ప్రవేశించిన ఉక్రెయిన్ బలగాలు, ఇక్కడ చేపట్టిన మిలటరీ ఆపరేషన్ సక్సెస్ అయినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. కుర్స్ Nuclear power plantను ఉక్రెయిన్ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలిపాయి. దక్షిణ కుర్స్ ప్రాంతంలో రెండు రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో తమ సైనికులు భారీగా విరుచుకుపడటంతో అక్కడి బలగాలకు భారీ ప్రాణ నష్టం వాటిల్లిందని జెలెన్స్కీ చెప్పారు. ‘గత రెండు రోజులుగా కుర్స్ ప్రాంతంలోని మఖ్నోవ్కా గ్రామ సమీపంలో జరుగుతున్న యుద్ధంలో మా బలగాలు పైచేయి సాధిస్తున్నాయి.
ఇది యుద్ధంలో మాకు మరో ముఖ్యమైన ముందడుగు’ అని జెలెన్స్కీ అన్నారు. దీంతో ఉక్రెయిన్ బలగాలు రష్యాలోకి మరింత ముందుకు వెళ్లేందుకు మార్గం సుగమమైందని నిపుణులు భావిస్తున్నారు. ఇది ఒక విధంగా రష్యా మిలటరీకి షాక్ లాంటిదేనని ఉక్రెయిన్ అధికారులు, రష్యన్ బ్లాగర్స్ చెబుతున్నారు. దక్షిణ కుర్స్లోని బోల్షో సోల్దాస్కో అనే గ్రామంలో ముందుకు వెళ్తున్న ఉక్రెయిన్ మిలటరీ వీడియో ఫుటేజీలు బయటకు వచ్చాయి.
కుర్స్ ప్రాంతంలో చేపట్టిన మిలటరీ ఆపరేషన్ సక్సెస్ అయినట్టు జెలెన్స్కీ కార్యాలయం హెడ్ ఆండ్రియా యెర్మాక్ మీడియాకు తెలిపారు. ప్రధానంగా కుర్స్ ప్రాంతంలో గత ఆరు నెలలుగా ఉక్రెయిన్ భీకర పోరు సాగిస్తున్నది. రష్యా ఆధీనంలోకి వెళ్లిన తర్వాత.. తిరిగి 40శాతం భూభాగాన్ని ఉక్రెయిన్ మిలటరీ స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి.