కీవ్: ఉక్రెయిన్‌కు చెందిన ఒక జంట వినూత్నంగా వివాహం చేసుకుంది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో సంప్రదాయంగా ధరించే తెల్లని దుస్తులు, సూట్‌కు బదులుగా వధువరులు మిలిటరీ యూనిఫాం ధరించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం చర్చి నుంచి బయటకు వచ్చి మీడియాకు కనిపించారు. ఈ సందర్భంగా పెళ్లి కుమారుడు తన రెండు చేతులతో పెళ్లి కుమార్తెను ఎత్తుకున్నాడు. ఆమెను తన చేతుల్లో ఉంచుకుని గుండ్రంగా రెండు సార్లు తిరిగాడు. ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి సలహాదారుడు అంటోన్ గెరాష్చెంకో ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఈ రోజుల్లో ఉక్రెయిన్‌లో పెళ్లిళ్లు ఇలా. తెల్లటి దుస్తులు, టక్సేడోలు లేవు. కానీ ప్రేమ, ఆనందం పుష్కలంగా ఉన్నాయి’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతివ్వండంటూ హ్యాష్‌ట్యాగ్ పెట్టారు. అయితే రష్యా దాడుల వల్ల శిథిలమైన భవనాల కుప్పలతో ఉక్రెయిన్ మిగిలింది.
కాగా, ఉక్రెయిన్‌కు చెందిన ది సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ హెడ్ ఒలెక్సాండ్రా మాట్విచుక్ జూన్ 12న ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ఉక్రేనియన్ రక్షకులు కాటెరినా, వాడిమ్ జంట పోల్టావా ప్రాంతంలో ఇలా వివాహం చేసుకున్నట్లు తెలిపారు. ఈ పెళ్లి కొన్ని గంటల్లోనే ముగిసిందని చెప్పారు. నూతన వధూవరులను అభినందించిన ఆమె, వారు కలకాలం సంతోషంగా కలిసి ఉండాలని ఆకాంక్షించారు.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే సుమారు మూడు లక్షల మంది ఈ వీడియోను చూశారు. సుమారు 20 వేల మంది లైక్ చేశారు. ఇలాంటి పెళ్లి, ఇలాంటి జంటను ఎప్పుడూ చూడలేదని కొందరు పేర్కొన్నారు. ఆ జంట కలకాలం సంతోషంగా ఉండాలంటూ మరి కొందరు విష్ చేశారు.
Ukrainian weddings these days.
No white dresses and tuxedos but plenty of love and happiness! 💛💙 #StandWithUkraine pic.twitter.com/7w4QoSYkEe— Anton Gerashchenko (@Gerashchenko_en) June 19, 2022