Russia – Ukraine War | మాస్కో: రష్యాతో యుద్ధం మొదలయ్యాక ఆ దేశంపై ఉక్రెయిన్ మొదటిసారి భారీగా డ్రోన్లతో దాడి చేసింది. సోమవారం అర్ధరాత్రి 10 ప్రాంతాలపై 343 డ్రోన్లతో విరుచుకుపడింది. ఇటీవల తమ విద్యుత్తు గ్రిడ్లు లక్ష్యంగా రష్యా బాలిస్టిక్ క్షిపణులు, 126 డ్రోన్లతో తమపై దాడి చేసిందని, దానికి ప్రతీకార చర్యగానే తాజా దాడి చేసినట్టు కీవ్ వర్గాలు తెలిపాయి. మాస్కోతో పాటు సరిహద్దు ప్రాంతాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్టు తెలుస్తున్నది.
కేవలం రాజధాని మాస్కోపైనే 91, కుర్క్స్ పైకి 126కి పైగా డ్రోన్లు దాడి చేశాయని ఆ నగర మేయర్ సెర్గీ సొబ్యనిన్ తెలిపారు. దాడులను సమర్థంగా ఎదుర్కొన్నట్టు చెప్పారు. కాగా డ్రోన్ దాడుల వల్ల విమానాలు, రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడింది. కార్లు, భవనాలు దెబ్బ తిన్నాయి. మాస్కోలోని నాలుగు ఎయిర్పోర్టులను మూసివేశారు. సాయంత్రానికి రాకపోకలను పాక్షికంగా పునరుద్ధరించినా, పలు సర్వీసులను మళ్లించారు.
రష్యాతో కాల్పుల విరమణకు సంబంధించి ఉక్రెయిన్ అధికారులు అమెరికాతో సౌదీ అరేబియాలో మంగళవారం చర్చలు జరపనుండగా ఈ దాడులు జరిగాయి. డ్రోన్ల దాడిలో ముగ్గురు మృతి చెందగా, 17 మంది గాయపడ్డారని రష్యా అధికారులు తెలిపారు. కీవ్ మంగళవారం చేసిన దాడికి ప్రతీకారంగా మాస్కో ఒరెష్నిక్ హైపర్ సానిక్ క్షిపణితో దాడికి సిద్ధంగా ఉందని రష్యా మాజీ రక్షణ మంత్రి కర్నల్ జనరల్ ఆండ్రీ కర్తపోలేవ్ హెచ్చరించారు.