ఉక్రెయిన్‌పై పుతిన్ ప్రకటించిన యుద్ధం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దేశాల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఈ మోడ్రన్ కాలంలో యుద్ధాలను ఎవాయిడ్ చేయడానికే ప్రపంచం ప్రయత్నిస్తుంది. దీనికోసమే ఐక్యరాజ్యసమతి వంటి సంస్థలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి సంస్థలు, ప్రపంచ దేశాలు చేసుకున్న ఒప్పందాలకు నీళ్లొదిలిన పుతిన్.. ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి చొచ్చుకెళ్లాలంటూ సైనికులకు ఆదేశాలు ఇచ్చాడు. దీని వల్ల ప్రపంచంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? భవిష్యత్తులో ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి? ఈ యుద్ధం ప్రపంచ శాంతిని ఏ మేర ప్రభావితం చేస్తుంది? అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్నాయి.
ఒక సార్వభౌమ దేశమైన ఉక్రెయిన్‌లో రష్యా చొరబాటు.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద చొరబాటని భద్రతా నిపుణుల అభిప్రాయం. పుతిన్ నిర్ణయం యూరప్ దేశాలు, రష్యా మధ్యలో ఉన్న దేశాలను తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. రష్యా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) రెంటిలో భాగం కాని దేశాల భద్రత ప్రశ్నార్థకం కానుంది. ఇది ఇలాగే కొనసాగితే రష్యా, ఈయూ, నాటో మధ్య ఈ ప్రాంతంపై ఆధిపత్య పోరుకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయమేంటంటే.. ఈయూ, నాటో ప్రస్తుతం కొత్త దేశాలను తమ బృందంలో కలుపుకోవడానికి బదులు, తమ బృందంలోని దేశాలను కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం మరీ ఎక్కువగా ఉంది.
కోల్డ్ వార్ సమయంలో రష్యా నుంచి రక్షణ కోసం పాశ్చాత్య దేశాలు అమెరికాపై ఆధారపడ్డాయి. అంటే మరోసారి ఈ దేశాలన్నీ అమెరికా సాయం అర్థించి, రష్యా వైపు ఉన్న దేశాల్లో మిలటరీ బలగాలను పెంచుకోవాల్సి ఉంటుంది. అంటే అప్పుడెప్పుడో రష్యాకు వ్యతిరేకంగా ఉపయోగించిన వ్యూహాల పుస్తకాల దుమ్ముదులపాల్సి వస్తుంది. అప్పుడు తూర్పు వైపు నాటో దేశాల్లో మిలటరీ బలం తప్పక పెంచాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతకాలం ఈ ప్రాంతంలో ఉన్న ప్రశాంతత మంటగలుస్తుంది. ఇంతకుముందు ఈయూ, నాటో తమ తూర్పు దేశాలను కలుపుకోవడానికి ఉత్సాహం చూపాయి. కానీ ఇప్పుడా పరిస్థితి లేకపోవడం ఆయా దేశాలకు శాపంలా మారింది. ఈ దేశాలపై రష్యా ఆక్రమణలకు తెగబడినా కూడా ఉక్రెయిన్ విషంయంలోలానే నాటో, ఈయూ మద్దతు ప్రకటించి వదిలేస్తాయా? అంటే వదిలేసే అవకాశమూ ఉందంటున్నారు భద్రతా నిపుణులు. ఎందుకంటే కాలం గడిచేకొద్దీ నాటో, ఈయూలు కొత్త సభ్యులను చేర్చుకోవడం కంటే, పాత సభ్యుల రక్షణకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇలా తమ సభ్య దేశాలను కాపాడుకోవాలన్నా కూడా నాటో, ఈయూలు మళ్లీ అమెరికా సాయమే కోరాల్సి ఉంటుంది.
ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించడాన్ని పుతిన్ సమర్థించుకుంటున్నాడు. సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత నాటో నెమ్మదిగా యూరప్ నుంచి తూర్పు దిశగా పాకడం ప్రారంభించింది. దీంతోపాటు ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవడాన్ని కూడా పుతిన్ గుర్తుచేస్తున్నాడు. నాటో, అమెరికా అన్ని చేసినప్పుడు తాము ఈ యుద్ధం చేస్తే తప్పేంటన్నది ఆయన వాదన. రష్యా బలహీనంగా ఉన్నప్పుడు యుగోస్లేవియా సరిహద్దులు మార్చడం, సెర్బియా నుంచి కోసోవోను లాక్కోవడం నాటో చర్యలతో తన నిర్ణయాన్ని పుతిన్ పోలుస్తున్నాడు. అదే నిర్ణయం అంతర్జాతీయంగా ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తూ వచ్చిన ఆర్డర్‌కు కలిగించిన నష్టాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. 2014లో కూడా ఉక్రెయిన్ నుంచి క్రిమియాను రష్యా ఆక్రమించుకుంది. ఈ క్రమంలో 1975లో రష్యా ప్రతినిధులు కూడా అంగీకరించి చేసుకున్న హెల్సింకీ ఒప్పందాన్ని కూడా ఆ దేశం ఉల్లంఘించింది. ఇప్పుడు కూడా రష్యా అదే తరహాలో ప్రవర్తిస్తోందనేది నాటో దేశాల వాదన
రష్యా ఇలా బరితెగించడం చూసి, మరికొన్ని దేశాలు ఇదే బాటలో నడిస్తే పరిస్థితి ఏంటి? చైనా ఎప్పటి నుంచో ఆశ పడుతున్న తైవాన్ వైపు కోరలు చాస్తే? ప్రపంచంలో సంక్షోభం ఉన్న ప్రాంతాలన్నీ కూడా చాలా సున్నితమైన ఒప్పందాలు, సంధులపైనే ఆధారపడి ఉన్నాయి. రష్యా నిర్ణయం వల్ల ప్రపంచంలో మిగతా దేశాల అలయెన్సులపై నమ్మకం ప్రశ్నార్థకంగా మారింది. అంటే యుద్ధం చేయబోమని ప్రమాణాలు చేసుకున్న దేశాలు.. ఆ మాటలు తుంగలో తొక్కి తుపాకులు తీస్తే? అప్పుడు ఇది ఊహించని దేశాల పరిస్థితి ఏంటి? ఈ అనుమానం వల్ల ఎన్నో దేశాల మధ్య బంధాలు చెడిపోయే ప్రమాదమూ ఉంది.
ఇదే ముదిరితే అణుశక్తి ఉపయోగం వరకూ ఈ సమస్య దారి తీయొచ్చు. అప్పుడు మరోసారి వివిధ ప్రాంతాల్లో స్థానిక భద్రతలు మరింత దిగజారతాయి. టర్కీ కూడా రష్యాలా చేయాలని అనుకుంటే సౌదీ అరేబియా, ఈజిప్టు ఏం చేస్తాయి? జర్మనీ వంటి యూరప్ దేశాల సైనికులు కూడా యుద్ధం వస్తే పోరాడే సత్తా తమకు లేదంటున్నారు. ఇంతకాలం శాంతిలో ఉన్న ఈ దేశాలు మిలటరీపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇలాంటి స్థితిలో సరైన ఆయుధాలు కూడా లేకుండా యుద్ధంలోకి వెళ్లడం సరికాదు. అందుకని దేశాలన్నీ యుద్ధ సంపదను పెంచుకుంటే.. ఎక్కువ బలం ఉన్న దేశం అది ఉన్న ప్రాంతాన్ని శాసించడం మొదలు పెడుతుంది. ఎంతో కష్టపడి సాధించుకున్న శాంతి పోయి.. బలమున్న వాడిదే రాజ్యం అవుతుంది. పరిస్థితి ఇంత వరకు రాకూడదనే ఆశిద్దాం.