కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లో ఉన్న డొనెస్కీ ప్రాంతంలో వేర్పాటువాదుల మధ్య ఘర్షణ మొదలైంది. ఉక్రెయిన్ ఆర్మీ అక్కడ ఉన్న వేర్పాటువాదులపై కాల్పులకు దిగింది. అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ త్వరలోనే ఆ ప్రాంతంపై పూర్తి స్థాయి యుద్ధానికి దిగనున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో డొనెస్కీ ప్రాంతంలో ఉన్న వేలాది మందిని రష్యాలోని రోస్టోవ్ ప్రాంతానికి తరలిస్తున్నారు. ఉక్రెయిన్ దళాల కాల్పులతో ప్రస్తుతం డొనెస్కీ ప్రాంతం ఉద్రిక్తతంగా మారింది. డోనెస్కీ, లుగాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్స్పై ఉక్రెయిన్ ఆర్మీ దళాలు నిషేధిత 120ఎంఎం మోర్టార్లు వాడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 25 వేల మందిని రష్యాకు తరలించారు. లైన్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద ప్రస్తుతం ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నది. అయితే డోన్బాస్ రిపబ్లిక్స్తో ఉక్రెయిన్ చర్చలు నిర్వహించాలని ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. వేర్పాటువాదులను తరిమివేయాలని ఉక్రెయిన్ చేపడుతున్న యుద్ధంతో డీపీఆర్, ఎల్పీఆర్ ప్రాంతంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వేర్పాటువాదులు జరిపిన కాల్పుల్లో ఓ ఉక్రెయిన్ సైనికుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. డీపీఆర్ వేర్పాటువాదులకు రష్యా మద్దతు ఇస్తున్నట్లు భావిస్తున్నారు. ఇక ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం కల్పించే అవకాశాలు లేవని జర్మనీ ఛాన్సలర్ స్కల్జ్ స్పష్టం చేశారు. వేర్పాటువాదులపై ఉక్రెయిన్ దళాలు మోర్టార్లు, గ్రేనేడ్ లాంచర్లు, యాంటీ ట్యాంక్ మిస్సైల్ సిస్టమ్స్‌తో దాడి చేస్తోంది. అయితే డోనెస్కీ దళాలు కూడా ఫైరింగ్‌తో ఉక్రెయిన్ ఆర్మీని అడ్డుకున్నాయి.