Donlad Trump | అమెరికా సైనిక సహాయాన్ని తాత్కాలికంగా తక్షణమే నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ దిగొచ్చారు. ఇటీవల జరిగిన చర్చల్లో ట్రంప్‌తో గొడవ జరగడం నిజంగా విచారకరమని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. విబేధాలు సరిచేసుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్)లో స్పందించారు.
ఉక్రెయిన్-అమెరికా మధ్య భవిష్యత్తులో పరస్పర సహకారం, కమ్యూనికేషన్ నిర్మాణాత్మకంగా ఉండేలా జాగ్రత్త పడతానని జెలెన్స్కీ తెలిపారు. అమెరికా కోరుతున్న అరుదైన ఖనిజాలు అందించేందుకు సిద్ధమేనని ప్రకటించారు. దీనిపై ఒప్పందం కుదుర్చుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ట్రంప్ బలమైన నాయకత్వంతో ముందుకు వెళ్లి రష్యాతో యుద్ధానికి పలికేందుకు వీలైనంత వేగంగా పనిచేస్తామని ప్రకటించారు.
అసలేం జరిగింది?
ఉక్రెయిన్‌కు అమెరికా సైనిక సహాయాన్ని తాత్కాలికంగా తక్షణమే నిలిపివేస్తున్నట్టు తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వైట్ హౌస్‌లోని అధ్యక్ష కార్యాలయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వాగ్యుద్ధం జరిగిన మూడు రోజులకే ట్రంప్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ఉక్రెయిన్‌కు తాత్కాలికంగా సైనిక సహాయాన్ని పూర్తిగా నిలిపివేయాలని, ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ట్రంప్ ఆదేశించినట్టు అమెరికా ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరిని ఉటంకిస్తూ ది న్యూయార్క్ టైమ్స్ మంగళవారం తెలిపింది. అమెరికా అధ్యక్షుడికి, జాతీయ భద్రతా విభాగానికి చెందిన సీనియర్ నాయకులకు మధ్య వరుస సమావేశాల అనంతరం ఈ నిర్ణయం వెలువడినట్టు పత్రిక తెలిపింది. రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోనంతవరకు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమలులో ఉంటుందని ఆ అధికారి వెల్లడించినట్లు పత్రిక తెలిపింది. అమెరికా రక్షణ కంపెనీల నుంచి నూతన సైనిక పరికరాలను ఉక్రెయిన్ కొనుగోలు చేయడానికి ఉద్దేశించిన లక్షల కోట్ల డాలర్ల భద్రతా సాయం కూడా ట్రంప్ ఉత్తర్వుల ఫలితంగా నిలిచిపోయినట్టు పత్రిక వివరించింది.