జెడ్డా: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కాల్పుల విమరణ(Ukraine Ceasefire)కు అంగీకరించినట్లు తెలుస్తోంది. అమెరికా చేసిన ప్రతిపాదనకు ఆయన ఆమోదం తెలిపారు. తక్షణమే 30 రోజుల పాటు కాల్పుల విమరణ పాటించాలని అమెరికా తన ప్రతిపాదనలో పేర్కొన్నది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో అమెరికా ప్రతినిధులతో ఉక్రెయిన్ బృందం జరిపిన చర్చల్లో ఈ ఒప్పందం కుదిరింది. రెండు దేశాల సీనియర్ అధికారుల భేటీ తర్వాత ప్రకటన రిలీజ్ చేశారు.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యాకు చేరవేస్తామని అమెరికా తెలిపింది. అయితే ఉక్రెయిన్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇంటెలిజెన్స్ షేరింగ్, సెక్యూర్టీ సహకారం ఇవ్వనున్నట్లు తెలిపింది. శాంతి దిశగా అడుగులు వేసేందుకు రెండు దేశాలకు చెందిన ప్రతినిధులు మళ్లీ చర్చలు చేపట్టనున్నారు. చర్చల ప్రక్రియలో రష్యా ప్రమేయాన్ని అమెరికా ఆశిస్తున్నది. అలాగే ఆ ప్రక్రియలో యురోపియన్ దేశాలు ఉండాలని ఉక్రెయిన్ కోరుతున్నది.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, నేషనల్ సెక్యూర్టీ అడ్వైజర్ మైక్ వాల్జ్.. ఉక్రెయిన్ అధికారులతో జరిగిన భేటీలో పాల్గొన్నారు. ఉక్రెయిన్ బృందంలో అధ్యక్షుడు జెలెన్స్కీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్న ఆండ్రీ యెర్మాక్, విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిహ, డిఫెన్స్ మంత్రి రుస్తెం ఉమెరోవ్, ఇతరులు ఉన్నారు. సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ కూడా మీటింగ్‌లో పాల్గొన్నారు.
ఉక్రెయిన్‌తో తాత్కాలిక కాల్పుల విరమణకు రష్యా అంగీకరిస్తుందన్న అభిప్రాయాన్ని అమెరికా మంత్రి మార్కో రూబియో వ్యక్తం చేశారు. ఒప్పందంపై రియాక్ట్ అయిన జెలెన్స్కీ.. ఒకవేళ రష్యా అంగీకరిస్తే, తక్షణమే కాల్పుల విరమణ అమలులోకి వస్తుందన్నారు. త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ట్రంప్ కలుసుకోనున్నారు. ఆ భేటీలో షరతులపై తుది అంగీకారం జరిగే అవకాశాలు ఉన్నాయి.