ఖార్కీవ్/న్యూఢిల్లీ, మార్చి 2: ఉక్రెయిన్‌లో రష్యా సాగిస్తున్న యుద్ధోన్మాదం కారణంగా భారతీయ విద్యార్థులు, పౌరులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. భయానక యుద్ధభూమి ఉక్రెయిన్ నుంచి బయటపడేందుకు సరైన రవాణా, ఇతర సదుపాయాలు లేవు. ఎలాగోలా నానాకష్టాలు పడి రైల్వేస్టేషన్‌కు చేరుకొంటే అక్కడ ఉక్రెయిన్ పోలీసుల వివక్ష. రైళ్లలోకి తమ దేశస్తులను అనుమతిస్తూ.. భారతీయులను అడ్డగిస్తున్నారు.
ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరమైన ఖార్కీవ్పై రష్యా బాంబులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో తక్షణం ఖార్కీవ్ను విడిచిపోవాలని ఇండియన్ ఎంబసీ తాజా అడ్వైజరీ మేరకు వందలాది విద్యార్థులు రైల్వేస్టేషన్‌కు చేరుకొన్నారు. వారిని రైలులోకి ఎక్కనీయకుండా ఉక్రెయిన్ గార్డ్లు అడ్డుకున్నారు. రైళ్లలో ఎక్కిన భారతీయులను దింపేస్తున్నారు. ఒకటి రెండు గేట్లు మాత్రమే తెరచి, వారి పౌరులను మాత్రమే ఎక్కనిస్తున్నారని, తమను ఎక్కనీయకుండా కొడుతూ. తన్నుతూ.. భయపెట్టేందుకు గాలిలోకి తుపాకులు పేలుస్తున్నారని ప్రగూన్ అనే విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ట్రైన్లో ఎక్కిన తమను దింపేశారని, మరో రైలులో కూడా అనుమతిస్తారా? లేదా? అనేది తెలియడం లేదని మరో విద్యార్థి వీడియో సందేశంలో పేర్కొన్నారు.
ఈశాన్య ఉక్రెయిన్-రష్యా సరిహద్దులోని సుమీ యూనివర్సిటీకి చెందిన 600 మందికి పైగా భారత విద్యార్థులు చిక్కుకుపోయారు. ఇప్పటి వరకు ఇక్కడి నుంచి ఒక్క విద్యార్థిని కూడా తరలించలేదని, ఆ దిశగా ఎంబసీ కూడా హామీ ఇవ్వలేదని విరాజ్ వాల్డే అనే విద్యార్థి పేర్కొన్నారు. మరోవైపు, భారత జెండాను చూపించి పాక్, టర్కీ దేశాల విద్యార్థులు సరిహద్దులకు సురక్షితంగా చేరుకొంటున్నట్టు కొందరు భారతీయ విద్యార్థులు పేర్కొన్నారు. మార్కెట్లో క్లాత్, కలర్లు కొనుగోలు చేసి పతాకాలు తయారు చేసుకుంటున్నట్టు తెలిపారు.
హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్ నుంచి బుధవారం 38 మంది తెలంగాణ విద్యార్థులు నాలుగు విమానాలలో ఢిల్లీకి చేరుకున్నారు. హైదరాబాద్ రావడానికి ఢిల్లీ తెలంగాణ భవన్ అధికారులు వారికి విమాన టికెట్లు అందించారు. ఉక్రెయిన్ నుంచి బుధవారం మొత్తం 1,377 మంది భారతీయులు దేశానికి వచ్చినట్టు కేంద్రం తెలిపింది.
కాల్పుల విమరణపై అర్థవంతమైన చర్చ జరుగడానికి ముందు.. రష్యా తక్షణం దాడులను ఆపేయాలి. కనీసం ప్రజలపై బాంబులు వేయడాన్ని మానుకోవాలి. దాడులు ఆపి, చర్చలు ప్రారంభించాలి. రష్యన్లు చంపడానికి, చావడానికే ఇక్కడికి వచ్చారు. మా జన్మభూమి కోసం చివరి వరకూ పోరాడుతాం.
-ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ