ఉక్రెయిన్‌కు చెందిన విమానయాన సంస్థ నిర్వహిస్తున్న ఆంటోనోవ్ కార్గో విమానం ఉత్తర గ్రీస్‌లోని కవాలా నగరం సమీపంలో శనివారం కూలిపోయిందని అధికారులు తెలిపారు. విమానం సెర్బియా నుంచి జోర్డాన్‌కు వెళ్తోందని గ్రీక్ సివిల్ ఏవియేషన్ అధికారులు చెబుతున్నారు, అయితే, విమానంలో ఎంత మంది ఉన్నారు? ఆ విమానంలో మనుషులున్నారా? లేదా వస్తువులున్నాయా? అనే విషయం తెలియలేదు. ఈ విమానాన్ని కార్గో క్యారియర్ మెరేడియన్ నిర్వహిస్తోంది.
విమానం ఇంజిన్లలో ఒకదానిలో సమస్యను గుర్తించిన పైలట్ అధికారులను హెచ్చిరించాడు. దీంతో థెస్సా లేదా కవాలా విమానాశ్రయంలో ల్యాండింగ్ కు అధికారులు అనుమతి ఇవ్వగా, అతడు కవాలా విమానాశ్రయాన్ని ఎంచుకున్నాడు. అయితే, విమానాశ్రయానికి పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో కూలిపోయిందని గ్రీస్ పౌర విమానయాన అథారిటీ వెల్లడించింది. తాము కొన్ని నిమిషాల క్రితం వరకూ పేలుడు శబ్దాలు విన్నామని పగ్గియో మునిసిపాలిటీ మేయర్ ఫిలిప్పోస్ అనస్తాసియాడిస్ అసోసియేటెడ్ ప్రెస్‌తో తెలిపారు. తాను క్రాష్ జరిగిన ప్రదేశం నుంచి 300 మీటర్ల దూరంలో ఉన్నట్లు చెప్పారు.