కీవ్: ఒక వైపు 34వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటున్న ఉక్రెయిన్ మరో వైపు రష్యాలోని పశ్చిమ కుర్క్స్ ప్రాంతంలోని అణు విద్యుత్తు కేంద్రంపై డ్రోన్లతో దాడి చేసింది. ఈ విషయాన్ని రష్యా అధికారులు నిర్ధారించారు. ఉక్రెయిన్ ప్రయోగించిన 95 డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకుని ధ్వంసం చేశాయని చెప్పారు.
తమ పవర్, ఎనర్జీ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్లు శనివారం రాత్రి దాడి చేశాయని తెలిపారు. ఈ దాడిలో న్యూక్లియర్ ప్లాంట్లో భారీగా మంటలంటుకున్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలిసింది. ఈ దాడి వల్ల ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం అయినా, రేడియో ధార్మికత స్థాయి సాధారణ స్థాయిలోనే ఉందని అధికారులు తెలిపారు.