కీవ్: దండయాత్రకు దిగిన రష్యా సైనిక దళాలను ఉక్రెయిన్ ఆర్మీ తీవ్రంగా ప్రతిఘటిస్తున్నది. రాజధాని కీవ్ తర్వాత రెండో ప్రధాన నగరమైన ఖార్కివ్ నుంచి రష్యా దళాలను తరిమికొట్టింది. ఆ నగరాన్ని పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు ఉక్రెయిన్ ఆర్మీ ఆదివారం ప్రకటించింది. ఖార్కివ్ గవర్నర్ ఒలేగ్ సినెగుబోవ్ దీనిని ధ్రువీకరించారు. నగరం పూర్తిగా తమ ఆధీనంలోనే ఉన్నదని టెలిగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఖార్కివ్లోకి ప్రవేశించిన రష్యా దళాలను ఉక్రెయిన్ ఆర్మీ ప్రతిఘటించడంతోపాటు అంతం చేసినట్లు తెలిపారు.
మరోవైపు రష్యన్ దళాలు ఇప్పటి వరకు ఉక్రెయిన్ ఎయిర్బేస్లను లక్ష్యంగా చేసుకున్నాయి. తాజాగా దక్షిణాదిలోని పోర్టు నగరాలపై దృష్టిసారించాయి. అలాగే ఇంధన, గ్యాస్ క్షేత్రాలు, పైప్లైన్లను టార్గెట్ చేస్తున్నాయి. ఉక్రెయిన్ రెండో ప్రధాన నగరమైన ఖార్కివ్ సరిహద్దుల వద్ద రష్యా దళాలు మోహరించాయి.