లండన్: ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఒక శతాబ్దానికిపైగా కాలంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని యునైటెడ్ కింగ్డమ్(యూకే) వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఈ పరిణామం కరువు, అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వర్షపాతం, ఇతర విపరీతమైన వాతావరణ పరిస్థితుల ముప్పును పెంచుతుందని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మెట్ ఆఫీస్ తెలిపింది. సాధారణ ఎల్ నినో ప్రభావంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీల సెల్పియస్ మేర పెరుగుతాయి. అయితే రాబోయే నెలల్లో ఈ ప్రక్రియలో రికార్డు స్థాయిలో మూడు డిగ్రీల సెల్సియస్ కంటే అధిక పెరుగుదల నమోదవుతుందని అంచానాలు సూచిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఇది మునుపెన్నడూ లేని అసాధారణ పరిణామం అని మెట్ ఆఫీస్ లాంగ్ రేంజ్ ఫోర్కాస్టింగ్ హెడ్ ఆడమ్ స్కైఫ్ పేర్కొన్నారు. ఒకవేళ ఉష్ణోగ్రతల పెరుగుదల ఊహించిననట్లే జరిగితే ప్రస్తుత 2026లో ఇప్పటివరకూ చూసిన ఎల్ నినో.. దాని ప్రపంచవ్యాప్త ప్రభావాల స్థాయిని మించిపోతుందని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు ఇప్పటికే ఈ ఏడాది చారిత్రక వాతావరణ విపత్తులతో సతమతమవుతున్నాయి. మానవ తప్పిదాల వల్ల ఏర్పడుతున్న వాతావరణ మార్పులకు తోడు ఈ ఎల్ నినో ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 2027 అత్యంత వేడిగా ఉండే సంవత్సరంగా మారే అవకాశం చాలా బలంగా ఉందని మెట్ ఆఫీస్ హెచ్చరించింది.
పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్ నినో ప్రక్రియ మన జీవితకాలంలో అత్యంత తీవ్రమైనదిగా ఉండే అవకాశం ఉందని యూకే వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ శక్తివంతమైన సహజ వాతావరణ పరిణామం ప్రపంచ ఉష్ణోగ్రతలను పెంచనున్నది. అలాగే తీవ్రమైన వాతావరణ పరిస్థితుల ప్రమాదాన్ని అధికం చేయనున్నది. ఎల్నినో కారణంగా భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుండగా, అట్లాంటిక్ మహాసముద్రంలో తుపానుల తీవ్రత తగ్గింది. ఈ ఏడాది చివర్లో ఎల్ నినో గరిష్ఠ స్థాయికి చేరుకోనున్నదని ఇది, 19వ శతాబ్దం తరువాత అత్యంత శక్తివంతమైన పరిణామం కావచ్చని మెట్ ఆఫీస్ తెలిపింది. ఉష్ణమండల పసిఫిక్కు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండనున్నది. దక్షిణ అమెరికా, ఉత్తర ప్రాంతాలు, ఆస్ట్రేలియాలో కరువు, దావానలాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. పెరూ, ఈక్వెడార్, దక్షిణ అమెరికా తదితర ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాన్ని పెంచనుంది.
భారతదేశం నుంచి రుతుపవనాలు ఇప్పుడే పూర్తిగా నిష్క్రమించడం లేదు. కానీ వాటి వర్షపాతం క్రమంగా నిర్దిష్ట ప్రాంతాలకే పరిమితం అవుతున్నది. ఈశాన్య మధ్యప్రదేశ్పై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం మధ్య, తూర్పు భారతదేశంలో నైరుతి రుతుపవనాలను చురుగ్గా ఉంచడంలో సహాయపడుతున్నది. తాజా సూచన ప్రకారం దేశంలోని పలు రాష్ర్టాల్లో రాబోయే రోజుల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య, తూర్పు, ఈశాన్య భారతదేశంలో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడులో చెదరుమదురు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది. భారతదేశంలోకి నైరుతి రుతుపవనాలు జూన్ 4న ప్రవేశించాయి. ఆగస్టు 21 నాటికి అసమాన వర్షపాతాన్ని మాత్రమే అందించాయి. దీంతో దేశం 14 శాతం వర్షపాత లోటును ఎదుర్కొంటున్నది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 254.9 మిమీ కాగా, ఇందులో 94 శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది.