Donald Trump : అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ తదితర దేశాలపై గుర్రుగా ఉంటున్నాడు. రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలే లక్ష్యంగా పలు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పడం కోసం రష్యాపై ఆంక్షలు విధించేందుకు యూకే ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) అంగీకరించారని ట్రంప్ చెప్పారు.
యూకే పర్యటన ముగించుకున్న ట్రంప్ అమెరికాకు తిరిగి వెళ్తుండగా ఎయిర్ఫోర్స్వన్లో మీడియాతో మాట్లాడారు. యుద్ధం ముగింపు తాను అనుకున్న దానికంటే కష్టంగా ఉందని అన్నారు. స్టార్మర్తో జరిగిన భేటీలో ఉక్రెయిన్ అంశం కూడా చర్చకు వచ్చిందని తెలిపారు. ఈయూ, నాటో దేశాలు మాస్కో నుంచి చమురు కొనుగోలు చేయడం గురించి తాను లేవనెత్తానని, దాంతో స్టార్మర్ కొంచెం ఇబ్బందిపడ్డారని చెప్పారు.
ఆ తర్వాత అది మంచి విషయం కాదని అతడు కూడా అంగీకరించాడని ట్రంప్ తెలిపారు. ఈ విషయంపై తాను స్టార్మర్ను అభినందిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేయడంతో సహా ఆ దేశంపై ఆంక్షలు విధించేందుకు స్టార్మర్ అంగీకరించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు ఇది సరైన చర్య అని ట్రంప్ అన్నారు. చమురు అమ్మకాలు ఆగిపోతే రష్యా అధ్యక్షుడు పుతిన్ దిగివస్తారని, దాంతో యుద్ధం ముగింపునకు అంగీకరిస్తారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అక్రమ వలసలు అరికట్టే అంశంపై తాము చర్చించామని ట్రంప్ చెప్పారు. వలసలకు వ్యతిరేకంగా బలమైన వైఖరి కనబర్చాలని, వాటిని అరికట్టేందుకు సైన్యాన్ని ఉపయోగించుకోవాలని తాను స్టార్మర్కు సూచించానని తెలిపారు.