US-South Korea | ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ను నియంత్రించడానికి మరోమారు అమెరికా-దక్షిణ కొరియా సిద్ధమయ్యాయి. ఇందుకోసం అమెరికా,దక్షిణ కొరియా మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఉత్తర కొరియాకు కళ్లెం వేయడానికి దక్షిణ కొరియా తరంలో అమెరికా అణ్వాయుధాలతో కూడిన జలాంతర్గామి మోహరిస్తుంది. సియోల్ న్యూ క్లియర్ ప్లానింగ్ ఆపరేషన్స్‌లో భాగస్వామిగా మారుతుంది. ఈ నేపథ్యంలో సొంతంగా అణ్వాయుధాలు తయారు చేయాలన్న ప్లాన్‌కు దక్షిణ కొరియా తిలోదకాలివ్వనున్నది. ఈ ఒప్పందాన్ని `వాషింగ్టన్ డిక్లరేషన్` అని అంటున్నారు.
ఉత్తర కొరియాను నిలువరించడానికి భాగస్వాములుగా తమ రెండు దేశాల మధ్య సమన్వయం పెరుగుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం దక్షిణ కొరియాను యుద్ధ సమయంలో రక్షించాల్సిన బాధ్యత అమెరికాదే. అవసరమైనప్పుడు అణ్వాయుధాలు కూడా వాడుతామని అగ్రరాజ్యం హామీ ఇచ్చింది. కానీ, దక్షిణ కొరియా వాసులు ఈ హామీని నమ్మకుండా సొంతంగా అణ్వాయుధాలు అభివృద్ధి చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు, ఉత్తర కొరియా సైతం సొంతంగా అణ్వాయుధాలు డెవలప్ చేసుకున్నది. ఈ పరిస్థితుల్లో వాషింగ్టన్ డిక్లరేషన్ పేరిట అమెరికా-దక్షిణ కొరియా కొత్త ఒప్పందం కుదరడం ఆసక్తికర పరిణామం. ఈ సందర్భంగా దక్షిణ కొరియా అధ్యక్షుడు యూ సుక్ యోల్ మాట్లాడుతూ.. `వాషింగ్టన్ డిక్లరేషన్‌తో దక్షిణ కొరియాకు అద్భుత హామీ లభించింది` అని అన్నారు. రెండు దేశాల మధ్య కొన్ని నెలల చర్చల తర్వాత ఈ ఒప్పందం కుదిరింది. అమెరికా-దక్షిణ కొరియా మధ్య కుదిరిన వాషింగ్టన్ డిక్లరేషన్.. ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు పెంచి వివాదాలు ముదిరేలా చేస్తుందని చైనా మండి పడింది.