ఫ్లోరిడా : భారతీయులు మన జేబులను ఖాళీ చేస్తున్నారని.. వాళ్ల వీసాలను వెనక్కి తీసుకొని వెంటనే దేశ బహిష్కరణ చేయాలని అమెరికాలోని ఫ్లోరిడా కౌన్సిల్ సభ్యుడు చాండ్లర్ లాంగెవిన్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ఎక్స్‌లో ఈ విషయమై వరుస పోస్ట్‌లు చేస్తున్నారు. వాటిని ట్రంప్‌కు ట్యాగ్ చేస్తున్నారు. అమెరికాలోని ఏ ఒక్క భారతీయుడు అమెరికా గురించి పట్టించుకోడని.. అమెరికన్లను ఆర్థికంగా దోచుకొని భారత్‌ను, భారతీయులను బలపరుస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. పామ్ బే సిటీ కౌన్సిల్ గురువారం రాత్రి ఆయన వ్యాఖ్యలను సెన్సార్(నిషేధం) చేసింది.
అమెరికా వలసదారులతో స్థాపించిన దేశమని ఆ నగర మేయర్ రాబ్ మెడినా అన్నారు. చాండ్లర్ను పదవి నుంచి తొలగించాలని హిందూస్ ఫర్ హ్యుమన్ రైట్స్ సంస్థ ఫ్లోరిడా గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. చాండ్లర్ ప్రవర్తనను ఖండిస్తున్నట్టు ది బ్రేవర్డ్ కౌంటీ రిపబ్లికన్ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే చాండ్లర్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. తన వ్యాఖ్యలు వలసలపై చర్చను ప్రారంభించడానికి ఉద్దేశించినవని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిలో తాను మొదటి రిపబ్లికన్ ఏమీ కాదన్నారు.