మనీలా: టైఫూన్ రాగస(Typhoon Ragasa) తైవాన్‌లో బీభత్సం సృష్టించింది. ఓ సరస్సు తెగిపోవడంతో సుమారు 15 మంది మృతిచెందారు. కొండల నుంచి సునామీ వచ్చినట్లుగా అధికారులు పేర్కొన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ బృందం పనితీరుపై తైవాన్ ప్రధాని చో జుంగ్ తాయి దర్యాప్తునకు ఆదేశించారు. తైవాన్‌లో మరో 17 మంది మిస్సింగ్‌లో ఉన్నారు. గువాంగ్‌ఫు టౌన్షిప్లో ఎక్కువగా మృతులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభావిత ప్రాంత ప్రజలను ఆదుకోనున్నట్లు చో వెల్లడించారు. గువాంగ్పులోని శరణార్థ క్యాంపులోకి వరద నీరు ప్రవేశించడంతో ప్రాణనష్టం సంభవించింది. ఆ స్కూల్ క్యాంపులో ఉన్న చైర్లు, టేబుళ్లు, రిఫ్రిజిరేటర్లు, కార్లు నీళ్లలో కొట్టుకుపోయాయి.
మరో వైపు టైఫూన్ రాగస.. దక్షిణ చైనాలోకి ప్రవేశించింది. గువాంగ్డాంగ్ ప్రావిన్సు వద్ద తీరాన్ని తాకింది. తీరం వద్ద గంటకుసుమారు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. హాంగ్‌కాంగ్‌లో కూడా భారీ నష్టం జరిగింది. సుమారు 63 మంది గాయపడ్డారు. అయితే సూపర్ టైఫూన్ కేటగిరీని హాంగ్‌కాంగ్ తగ్గించింది. కొన్నిచోట్ల భారీ వృక్షాలు కూలాయి. అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది.