జకార్తా: ఇండోనేషియా(Indonesia)లో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 14 మంది మృతిచెందగా, 84 మంది గాయపడ్డారు. దేశ రాజధాని జకార్తా శివారులో ఉన్న బెకాసి వద్ద ఈ ప్రమాదం జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని తొలగించే ప్రయత్నం జరుగుతుందని రైల్వే అధికారులు చెప్పారు. ఓ కమ్యూటర్ ట్రైన్తో పాటు లాంగ్ డిస్టాన్స్ రైలు సోమవారం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరుకున్నట్లు ఇండోనేషియా రైల్వే శాఖ సీఈవో బాబీ రసియిదిన్ తెలిపారు. గాలింపు ప్రక్రియ ముగిసినట్లు రెస్క్యూ ఏజెన్సీ అధిపతి మొహమ్మద్ స్యాఫి తెలిపారు. రైల్వే బోగీలు నుజ్జు నుజ్జు అయ్యాయని, వాటిల్లో చిక్కుకున్న వారిని తొలగించడం పెద్ద సమస్యగా మారిందన్నారు.
రైలుకు చెందిన మహిళా బోగీ దెబ్బతిన్నదని, బాధితుల్లో అందరూ మహిళలే ఉన్నట్లు అధికారులు తెలిపారు. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు ఇనుపకడ్డీలను గ్రైండర్లతో కట్ చేశారు. స్థానికంగా తిరిగే లోకల్ కమ్యూటర్ రైలు తొలుత ఓ ట్యాక్సీ ఢీకొన్నదని, ఆ తర్వాత అది మళ్లీ దూరం వెళ్లే మరో రైలును ఢీకొన్నట్లు బాబీ తెలిపారు.