REMspace | కాలిఫోర్నియా, అక్టోబర్ 14: కలలో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోగలరా? ఏం మాట్లాడుకున్నారో మెలకువ వచ్చాక గుర్తుపెట్టుకోగలరా? ఇలాంటివి సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కాకుండా నిజజీవితంలో సాధ్యమా? అంటే అవుననే అంటున్నది అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ‘ఆర్ఈఎంస్పేస్’ అనే అంకుర సంస్థ. ఇద్దరు మనుషులు నిద్రలోనే మాట్లాడుకునేలా తాము చేపట్టిన ప్రయోగం విజయవంతమైందని ఈ సంస్థ ప్రకటించింది. సెప్టెంబర్ 24న జరిగిన ఈ ప్రయోగం వివరాలను ఈ సంస్థ తాజాగా వెల్లడించింది.
ప్రయోగం జరిగిందిలా…
ముందుగా ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ఇండ్లలో నిద్రపోయారు. వీరికి సర్వర్, వైఫైతో అనుసంధానమై ఉన్న సెన్సార్‌తో కూడిన పరికరాలను అమర్చారు. మొదటి వ్యక్తి కలలోకి జారుకున్న విషయాన్ని మెదడు తరంగాలను ట్రాక్ చేసి ఈ పరికరం గుర్తించింది. ఈ విషయాన్ని సర్వర్‌కు చేరవేసింది. తర్వాత సర్వర్ ‘రెమ్యో’ అనే విభిన్న భాష నుంచి ‘ఝిలక్’ అనే పదాన్ని సృష్టించింది. ఈ పదాన్ని ఇయర్‌బడ్స్ ద్వారా కలలో ఉన్న మొదటి వ్యక్తికి చేరవేసింది.
కలలోనే అతడు ఈ పదాన్ని గట్టిగా పలికాడు. అతడి మాట సెన్సార్‌లో స్టోర్ అయ్యింది. ఎనిమిది నిమిషాల తర్వాత రెండో వ్యక్తి కూడా కలలోకి వెళ్లిన విషయాన్ని సర్వర్ గుర్తించింది. మొదటి వ్యక్తి పలికిన ‘ఝిలక్’ అనే పదాన్ని ఇయర్‌బడ్స్ ద్వారా రెండో వ్యక్తికి సర్వర్ పంపించింది. ఈ పదాన్ని ఆమె కూడా పలికింది. నిద్ర లేచిన తర్వాత కూడా తాను విన్న పదాన్ని చెప్పింది.
నిద్రపై పరిశోధనల్లో మైలురాయి
తమ ప్రయోగం విజయవంతమైందని, నిద్రపై పరిశోధనల్లో ఇది కీలకమైన మైలురాయి అని ఆర్ఈఎంస్పేస్ సంస్థ సీఈవో మైకేల్ రడుగ పేర్కొన్నారు. తాము అభివృద్ధి చేసిన ఈ సాంకేతికతను శాస్త్రవేత్తలు సమీక్షించాల్సి ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఈ సాంకేతికత మన జీవితాల్లో భాగం అవుతుందని, దీని ఆధారంగా అనేక వాణిజ్య పరికరాలు తయారవుతాయని చెప్పారు. కాగా, ఈ ప్రయోగానికి వాడిన సాంకేతికత ఏంటనేది మాత్రం ఈ సంస్థ వెల్లడించలేదు.