ఖాట్మాండు: నేపాల్‌లో ఎవరెస్ట్(Mount Everest) శిఖరాన్ని ఎక్కిన ఇద్దరు భారతీయులు మృతిచెందారు. ఎవరెస్ట్ నుంచి కిందకు దిగుతున్న సమయంలో ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు శుక్రవారం తెలిసింది. నేపాల్ పర్వతారోహణ అధికారి రిషి భండారి ఈ విషయాన్ని ఇవాళ వెల్లడించారు. ఎవరెస్ట్ నుంచి కిందకు దిగుతున్న సమయంలో.. ఓ పర్వతారోహకుడు తీవ్రంగా అలసిపోయినట్లు చెప్పారు. అయితే అతని ప్రాణాలను కాపాడేందుకు షెర్పాలు తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలిపారు. హిల్లరీ స్టెప్ వద్ద అరుణ్ తివారి అనే పర్వతారోహకుడు మృతిచెందినట్లు భండారి చెప్పారు. సందీప్ ఆరె అనే వ్యక్తి రెండో క్యాంప్ వద్ద ప్రాణాలు కోల్పోయాడు.
కామి రీటా అభ్యర్థన..
ఎవరెస్ట్‌ను అత్యధికంగా 32 సార్లు అధిరోహించిన నేపాలీ షెర్పా కామి రీటా ఇవాళ అభ్యర్థన చేశారు. 8849 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్‌ను ఎక్కేందుకు పర్వతారోహకులు అధిక సంఖ్యలో వస్తున్నారని, దీని వల్ల ఆ కొండ రద్దీగా మారినట్లు ఆయన తెలిపారు. అయితే పర్వతారోహకుల సంఖ్యపై నియంత్రణ పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈసారి చైనా వైపు నుంచి ఎవరెస్ట్ ఎక్కేందుకు అనుమతి లేకపోవడంతో.. నేపాల్ వైపు నుంచి భారీ సంఖ్యలో పర్వతారోహకులు రిజిస్టర్ చేసుకున్నారు. బుధవారం ఒక్క రోజే నేపాల్ వైపు నుంచి 274 మంది క్లైంబర్లు ఎవరెస్ట్ చేసుకున్నారు. ఈసారి మొత్తం 494 మంది పర్వతారోహకులకు నేపాల్ అధికారులు పర్మిషన్ ఇచ్చారు.
పర్వతారోహకులకు సరిపడ షెర్పాలు ఉన్నా.. ఎవరెస్ట్ పర్వతం రద్దీగా మారిపోయిందని కామి రీటా అన్నారు. అధికారులు క్లైంబర్ల సంఖ్యను కంట్రోల్ చేయాలన్నారు. ఎవరెస్ట్ శిఖరంపై రోప్ మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడం వల్ల.. ఆ పర్వతారోహకులు అధిక సమయం కఠినమైన వాతావరణంలో గడపాల్సి వస్తోందని, దీని వల్ల వాళ్ల ప్రాణాలు ఇబ్బందుల్లో పడుతున్నాయన్నారు. కామి రీటాతో పోటీపడుతున్న పసాంగ్ దవా షెర్పా ఇప్పటికే ఎవరెస్ట్‌ను 31 సార్లు అధిరోహించారు.