న్యూయార్క్: ఇటీవల ట్విట్టర్ సంస్థను ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సంస్థలో 50 శాతం ఉద్యోగులపై వేటు వేశారు. వాళ్లకు మూడు నెలల జీతం ఇచ్చి పంపేశారు. ఈ నిర్ణయాన్ని మస్క్ సమర్థించుకున్నారు. తన వద్ద మరో మార్గం లేదన్నారు. ట్విట్టర్ సంస్థ ప్రతి రోజు కనీసం 40 లక్షల డాలర్లు నష్టపోతున్నట్లు ఆయన వెల్లడించారు.
కంపెనీలో 50 శాతం మంది ఉద్యోగుల్ని తీసివేస్తున్నట్లు ట్విట్టర్ సంస్థలోని సేఫ్టీ అండ్ ఇంటిగ్రిటీ అధిపతి యోల్ రోత్ తన ట్వీట్లో తెలిపారు. కాంటెంట్ అంశంలో మాత్రం ఎటువంటి మార్పులు ఉండవని మస్క్ స్పష్టం చేశారు. 44 బిలియన్ల డాలర్లకు ఇటీవల ట్విట్టర్‌ను మస్క్ సొంతం చేసుకున్నారు.
వేటు వేసిన ఉద్యోగులకు మూడు నెలల జీతం ఇచ్చామని, అంటే చట్ట ప్రకారం 50 శాతం ఎక్కువే ఇచ్చామని ఓ ట్వీట్లో మస్క్ వెల్లడించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై విధించిన పర్మనెంట్ బ్యాన్‌ను ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి.