టోక్యో, జనవరి 5: ఒక చేప ధర అక్షరాల రూ.11 కోట్లు. అలాగని ఆ చేప కడుపులో విలువైన వజ్రాలో, డ్రగ్సో లేవు. అదొక బ్లూఫిన్ ట్యూనా చేప. ఒక మోటారు బైక్ సైజులో 276 కిలోల బరువున్న ట్యూనా చేపకు జపాన్‌లోని టోక్యో చేపల మార్కెట్లో పలికిన ధర 1.3 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.11 కోట్లు పైనే). ఒనడ్రా గ్రూప్‌నకు చెందిన సుషీ రెస్టారెంట్ యజమానులు దానిని భారీ ధరకు కొనుగోలు చేశారు.
గత ఏడాది వీరే 114 మిలియన్ యెన్లు (సుమారు రూ.6 కోట్లు) వెచ్చించి ఒక ట్యూనా చేపను కొన్నారు. 1999 తర్వాత ఈ ఫిష్ మార్కెట్లో అత్యధిక ధర పలికిన రెండో చేపగా ఇది రికార్డుకెక్కింది. ఆ ఏడాది 278 కిలోల బ్లూఫిన్ ట్యూనా చేప సుమారు రూ.18 కోట్లకు అమ్ముడుపోయింది.