అమెరికాలోని అలస్కా (Alaska) తీరంలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదయింది. బుధవారం మధ్యాహ్నం 12.37 గంటల సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) భూమి కంపించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. 20 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని, స్యాండ్ పాయింట్ సిటీకి 87 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. అయితే భూకంపం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ముందు జాగ్రత్తగా పౌరులను సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు సూచించారు.
భారీ భూకంపం నేపథ్యంలో దక్షిణ అలస్కా, అలస్కా పెనిన్సులా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. గంట తర్వాత హెచ్చరికలను విరమించుకున్నది. భూకంపాలు తరుచుగా వచ్చే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో అలస్కా ఉంది. 1964 మార్చి నెలలో 9.2 తీవ్రతతో ఈ ప్రాంతంలో భూకంపం వచ్చింది. దీంతో 250 మందికిపైగా మరణించారు. 2023లో 7.2 తీవ్రతతో భారీ భూకంపం వచ్చినప్పటికీ పెద్దగా నష్టం సంభవించలేదు.