Donald Trump : హమాస్ (Hamas) తిరుగుబాటుదారులే (Rebels) లక్ష్యంగా ఖతార్ (Quatar) రాజధాని దోహా (Doha) పై ఇజ్రాయెల్ (Israel) తాజాగా వైమానిక దాడులు (Air strikes) చేసింది. ఈ దాడికి సంబంధించి అమెరికాకు సమాచారం ఉన్నప్పటికీ.. ఖతార్‌కు ఆ విషయం చెప్పడంలో ఆలస్యం చేసింది. దాంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) డబుల్ గేమ్ (Double game) ఆడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇజ్రాయెల్ చేసిన ఈ దాడిలో హమాస్ కీలక నేత ఖలీల్ అల్-హయ్యా కుమారుడితో సహా ఆరుగురు మృతి చెందారు. దాడి గురించి అమెరికాకు ముందే సమాచారం ఇచ్చామని టెల్అవీవ్ చెప్పింది. అమెరికా కూడా ఆ విషయాన్ని అంగీకరిస్తూనే.. దాడి గురించి తాము వెంటనే ఖతార్‌కు సమాచారం ఇచ్చామని పేర్కొంది. అయితే దాడులు మొదలైన 10 నిమిషాల తర్వాత యూఎస్ నుంచి తమకు కాల్ వచ్చిందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికారి పేర్కొన్నారు. పేలుళ్లు జరుగుతుండగా అమెరికా అధికారి ఒకరు ఫోన్ చేశారని చెప్పారు. దాంతో ట్రంప్ తనవద్ద దాడి సమాచారం ఉన్నా ఖతార్‌కు ఎందుకు చేరవేయలేదని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా ఇటీవల మిత్రదేశాలతో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మిత్ర దేశమంటూనే భారత్‌పై భారీ సుంకాల మోత మోగించారు. తాజా దాడులతో ఖతార్‌కు కూడా ట్రంప్ నుంచి అలాంటి చేదు అనుభవం ఎదురైనట్లు ఉంది. కాగా అమెరికా- ఖతార్‌ల మధ్య బంధం ఇటీవల బలపడింది. ఆ దేశ పాలకుల నుంచి ట్రంప్ విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా అందుకున్నారు. పర్యటనలో కీలక ఒప్పందాలు కుదుర్చుకొన్నారు. ఈ క్రమంలో అమెరికా మిత్రదేశం ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడమనేది చర్చనీయాంశమైంది.