వాషింగ్టన్, జూన్ 14 : అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై మళ్లీ అనిశ్చితి ఏర్పడింది. తన 80వ పుట్టిన రోజైన ఆదివారం ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నాం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కార్యరూపం దాల్చలేదు. లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు జరపటంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం నాటి షెడ్యూల్లో ఒప్పందానికి సంబంధించి అధికారిక కార్యక్రమం లేదు. దీంతో ట్రంప్ చెబుతున్న ఒప్పందం.. సిద్ధంగా ఉందా? లేదా? అసంపూర్ణంగా ఉన్న ప్రక్రియను పూర్తయిన ఒప్పందంగా చూపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, లెబనాన్‌పై దాడుల్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇలాగైతే ప్రతిపాదిత ఒప్పందంపై ముందుకెళ్లడం సాధ్యం కాదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్ అమెరికాకు తేల్చిచెప్పారు. దీంతో ఇజ్రాయెల్ తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీరియస్ అయ్యారు. ఇరాన్‌తో ఒప్పందానికి చేరువలో ఉన్నామని, సైనిక దాడులు వెంటనే ఆపాలని స్పష్టంచేశారు.
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం వైపు అడుగులు వేస్తున్నా.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ మిలిటరీ దాడులు ఆదివారం కొనసాగాయి. హెజ్బొల్లా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని బీరుట్‌పై బాంబు దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ప్రకటించింది. ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులకు ప్రతీకారంనే ఈ దాడులు చేసినట్టు పేర్కొన్నది. ఈ దాడుల్లో కనీసం ముగ్గురు పౌరులు చనిపోయినట్టు లెబనాన్ తెలిపింది.
లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. శాంతి ఒప్పందాన్ని అమలుజేసే సంకల్పం, సామర్థ్యం, సంకల్పం లేనప్పుడు శాంతి ఒప్పందంపై ముందుకెళ్లలేమని అమెరికాకు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్ తేల్చిచెప్పారు. ఆదివారం ‘ఎక్స్’లో స్పందిస్తూ, ‘ఇజ్రాయెల్ దురాక్రమణతో తమ హామీలను నెరవేర్చే సంకల్పం అమెరికాకు లేదని మరోసారి రుజువైంది. హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైతే శాంతి చర్చల వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ముందుకు సాగటం గురించి మాట్లాడుకోవటలో అర్థం లేదు’ అని అన్నారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ రాజీనామా చేయాలంటూ ఇరాన్లో నిరసనలు వెల్లువెత్తాయి. అమెరికాతో శాంతి ఒప్పందం విషయంలో దేశ ప్రయోజనాలను అరాగ్చీ తాకట్టు పెడుతున్నారని వారు మండిపడుతున్నారు. ఈ ఒప్పందం వల్ల అత్యంత కీలకమైన హొర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని.. ఇరాన్‌కు ఇది భారీ నష్టం అని నిరసనకారులు చెబుతున్నారు. యూఎస్‌తో ఒప్పందంపై అరాగ్చీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిరసనలు పెరిగాయి. యూఎస్-ఇరాన్ మధ్య ఒప్పందం ఆదివారం నాటికి ముగుస్తుందని.. ఎలక్ట్రానిక్ సంతకాలు చేయడమే ఆలస్యం అని డొనాల్డ్ ట్రంప్, పాక్ అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రకటనలను ఇరాన్ విదేశాంగ శాఖతోసిపుచ్చింది.