న్యూఢిల్లీ, జూన్ 17: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య ప్రవర్తన మరోసారి బయటపడింది. ఇరాన్‌తో యుద్ధం ముగించడానికి కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం(ఎంవోయూ) అంతిమం కాదని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ సరిగ్గా ప్రవర్తించకపోతే మళ్లీ బాంబు దాడులు ప్రారంభించవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. స్విట్జర్లాండ్‌లో అవగాహన ఒప్పందంపై అమెరికా, ఇరాన్ అధికారికంగా సంతకం చేయడానికి రెండు రోజుల ముందు ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ నుంచి ఈ ఘాటైన వ్యాఖ్యలు రావడం ఒప్పందం బలహీనతను సూచిస్తున్నది. ఇది తుది ఒప్పందం కాదు. కేవలం ఒక అవగాహన ఒప్పందం మాత్రమే. ఒకవేళ ఇది నాకు నచ్చకపోయినా లేదా వారు (ఇరాన్) సరిగ్గా ప్రవర్తించకపోయినా మేము వెంటనే వారి నెత్తి మీదే బాంబులు వేసే స్థితికి తిరిగి వెళతాము. ఎందుకంటే గత 47 ఏండ్లుగా వారు దుర్మార్గంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఒబామాపై విమర్శలు
జీ7 సమావేశం కోసం ఫ్రాన్స్‌లో అడుగుపెట్టినప్పటి నుండి తన ఇరాన్ ఒప్పందం గురించి గొప్పగా చెప్పుకోవడం ఆపని ట్రంప్ కొందరు మూర్ఖులు కోరుకున్న ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యాన్ని తాను అడ్డుకున్నానని చెప్పారు. అయితే ఆ మూర్ఖులెవరో ఆయన నేరుగా పేర్లు వెల్లడించలేదు. ఇరాన్‌తో ఒప్పందాన్ని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాసహా తాను తప్ప ఎవరూ సాధించలేకపోయేవారని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ విషయంలో ఒబామా అనేక వందల కోట్ల డాలర్లు ఖర్చు చేసినప్పటికీ విఫలమయ్యారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా ఒబామా పై అసభ్య పదజాలాన్ని కూడా ట్రంప్ ప్రయోగించారు.
యుద్ధంలో గ్రోక్‌ను వాడిన యూఎస్
ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా ఎక్స్ ఏఐ చాట్ బాట్ గ్రోక్‌ను వాడటం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా పెంటగాన్ ఏఐ, డిజిటల్ చీఫ్ కామెరాన్ స్టాన్లే తెలిపారు. గ్రోక్ సాయంతో ఇరాన్ మీద 96 గంటల్లో 2వేలకు పైగా మిస్సైళ్లను విజయవంతంగా వేసి పలు లక్ష్యాలను ధ్వంసం చేసినట్టు ఆయన చెప్పారు.
ఇరాన్ వద్ద అణుబాంబు కన్నా శక్తివంతమైన ఆయుధం!
పశ్చిమాసియాలో ఘర్షణ మొదలై ఆ తర్వాత అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి మూడు నెలలు దాటిన తరుణంలో అణ్వాయుధం కన్నా శక్తివంతమైన ఒక ఆయుధాన్ని ఇరాన్ సమకూర్చుకుంది. కీలకమైన హొర్ముజ్ జలసంధిని తన ఇష్టారీతిన మూసివేసే శక్తి ఇరాన్‌కు ఉందని అమెరికా నిఘా సంస్థలు బుధవారం హెచ్చరించాయి. అమెరికాతో కుదుర్చుకోనున్న శాంతి ఒప్పందంతో సంబంధం లేకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసే ఇరాన్ సామర్థ్యం మళ్లీ పెరగవచ్చని నిఘా సంస్థల అంచనాను ఉటంకిస్తూ సీఎన్ఎన్ వార్తాసంస్థ తెలిపింది. హొర్ముజ్ జలసంధిపై వాస్తవ నియంత్రణను ఇప్పుడు మనం ఇరాన్‌కు అప్పగించాము. ఇది అణ్వాయుధం కన్నా చాలా శక్తివంతమైన ఆయుధం అని ఆ వర్గాలు వార్తాసంస్థకు తెలిపాయి.