Donald Trump | వాషింగ్టన్ : అంతర్జాతీయ వాణిజ్యంలో సుంకాలతో సంబంధం లేకుండా ఇతర రూపాలలో అమెరికాను మోసం చేసేందుకు ప్రయత్నిస్తే తమ మధ్య సంబంధాలు దెబ్బతినగలవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా హెచ్చరికలు జారీచేశారు. ఇందుకు సంబంధించి ఎనిమిది సూత్రాల జాబితాను ఆయన ప్రకటించారు. చైనాను మినహాయించి మిగిలిన దేశాలకు ప్రతీకార సుంకాల అమలుపై 90 రోజులపాటు అమెరికా ఉపశమనం కలిగించిన నేపథ్యంలో ట్రంప్ నుంచి తాజా హెచ్చరికలు వెలువడ్డాయి.
అమెరికా ఉత్పత్తులు అంతర్జాతీయ విపణిలో ఖరీదు ఎక్కువగా ఉండేలా చేసి తమ వస్తువులను చౌకగా విక్రయించేందుకు తమ కెరెన్సీ విలువను ఉద్దేశపూర్వకంగా తగ్గించరాదని ట్రంప్ హెచ్చరించారు. దిగుమతులపై వ్యాట్ కొనసాగించి ఎగుమతులపై ఆ సొమ్మును రిఫండ్ చేసే చర్యలను సహించబోమని స్పష్టంచేశారు. భారీ స్థాయిలో తయారుచేసి వాటిని ఇతర దేశాలకు కారు చౌకగా డంపింగ్ చేస్తే సహించబోమన్నారు. ఎగుమతులపై ప్రభుత్వాలు రాయితీ ఇవ్వరాదని స్పష్టం చేశారు. వీటితోపాటు నకిలీ వస్తువుల తయారీ, మేధో హక్కుల చౌర్యం, సుంకాలు తప్పించుకోవడానికి మరో దేశం నుంచి ఎగుమతి చేయడంతోపాటు జపాన్ నిర్వహించే బౌలింగ్ బాల్ టెస్ట్‌పై కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.