Donald Trump : పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలను తగ్గించడం కోసం అమెరికా-ఇరాన్ (US-Iran) దేశాలు రెండు వారాలపాటు తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. అయినా పలు ప్రాంతాల్లో దాడులు కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సోషల్ మీడియాలో కీలక పోస్ట్ చేశారు. యుద్ధం ముగింపునకు సంబంధించి పూర్తిస్థాయి ఒప్పందం అమలయ్యేదాకా తమ దేశానికి చెందిన యుద్ధనౌకలు (War Ships), బలగాలు ఇరాన్‌ను చుట్టుముట్టే ఉంటాయని ఆయన స్పష్టంచేశారు.
ప్రస్తుతం కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. యుద్ధం ముగించే విషయంలో ఇరాన్‌తో పూర్తిస్థాయి ఒప్పందం కుదిరి అది అమల్లోకి వచ్చేంతవరకు తమ యుద్ధ నౌకలు, విమానాలు, సైనిక సిబ్బంది, ఆయుధాల వంటివన్నీ ఇరాన్, దాని పరిసర ప్రాంతాల్లోనే మోహరించి ఉంటాయని పేర్కొన్నారు. ఏదైనా కారణంతో ఇరాన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే గనుక.. మునుపెన్నడూ చూడనంత స్థాయిలో తాము విరుచుకుపడతామని వార్నింగ్ ఇచ్చారు.
ఈలోగా అమెరికా సైన్యం విశ్రాంతి తీసుకుంటూ తమ తదుపరి మిషన్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక నుంచి ఇరాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండకూడదని, హర్మూజ్ జలసంధిని తెరిచి సురక్షితంగా ఉంచాల్సిందేనని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో రాసుకొచ్చారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో హర్మూజ్‌ను మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలోనే ట్రంప్.. టెహ్రాన్‌కు మళ్లీ హెచ్చరికలు చేశారు. దాంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ నివురుగప్పిన నిప్పులా మారాయి. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ భాగం కాదని పేర్కొంటూ ఇజ్రాయెల్ ఆ దేశంపై భీకర దాడులు చేసింది. ఇందులో వందల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై దాడులకు దిగింది.