Donald Trump | వాషింగ్టన్, డిసెంబర్ 11 : అమెరికా నేలపై జన్మించే వారికి హక్కుగా దక్కే పౌరసత్వాన్ని రద్దు చేసే యోచనలో కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టగానే ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌ను రద్దు చేస్తానని గత వారం ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. జన్మతః పౌరసత్వం హాస్యాస్పదంగా మారిందని, దీనిని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇది ‘బర్త్ టూరిజం’కు అవకాశం కల్పిస్తున్నదని, ఇతర దేశాలకు చెందిన గర్భిణులు కేవలం పుట్టబోయే బిడ్డకు అమెరికా పౌరసత్వం దక్కాలనే ఆలోచనతో అమెరికాకు వచ్చి జన్మనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలోనూ తాను బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌ను రద్దు చేస్తానని ట్రంప్ ప్రకటించారు.
అమెరికాలో జన్మించిన ప్రతి బిడ్డకు తల్లిదండ్రులు ఏ దేశం వారనేది సంబంధం లేకుండా ఆటోమేటిక్‌గా దేశ పౌరసత్వం దక్కుతుంది. దీనినే బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అంటారు. ఏ వీసాపై అమెరికాకు వచ్చినా, ఆఖరికి అక్రమంగా వలస వచ్చిన తల్లిదండ్రులైనా సరే ఇక్కడ బిడ్డకు జన్మనిస్తే ఆ బిడ్డకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది. 1868 నుంచి అమెరికాలో ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అమలులో ఉంది.
ఎన్నికల ముందు నుంచీ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ రద్దు చేస్తానని ట్రంప్ చెప్తున్నప్పటికీ అది అంత సులువు కాదని అమెరికా న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా రాజ్యాంగం.. 14వ రాజ్యాంగ సవరణ ద్వారా జన్మతః పౌరసత్వాన్ని కల్పించింది. ఇప్పుడు దీనిని రద్దు చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఇందుకు కాంగ్రెస్‌లో మూడింట రెండొంతుల మెజారిటీతో పాటు నాలుగింట మూడొంతుల రాష్ర్టాల ఆమోదముద్ర అవసరం. ట్రంప్ ఇది సాధించడం కష్టమని న్యాయ నిపుణులు చెప్తున్నారు. అయితే, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌పై ట్రంప్ ఆంక్షలు విధించగలరని అభిప్రాయపడుతున్నారు.
ఒకవేళ ట్రంప్ కనుక బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌ను రద్దు చేస్తే అమెరికాలో ఉన్న లక్షలాది మంది భారతీయులపై ప్రభావం పడుతుంది. గ్రీన్‌కార్డులు, హెచ్-1బీ వీసాలపై అమెరికాలో ఉంటున్న భారతీయులు జన్మనిచ్చే పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించదు. తల్లిదండ్రులకు పౌరసత్వం లభించడంపైనే పిల్లల పౌరసత్వం కూడా ఆధారపడి ఉంటుంది. పిల్లల పౌరసత్వం కోసం గ్రీన్ కార్డు ఉన్న తల్లిదండ్రులకు కొంత న్యాయపరమైన వెసులుబాటు ఉండే అవకాశం ఉందని, హెచ్-1బీ వీసా కలిసిన తల్లిదండ్రులకు మాత్రం బిడ్డల పౌరసత్వంపై గందరగోళం నెలకొంటుందని ఇమిగ్రేషన్ నిపుణులు చెప్తున్నారు. అమెరికా గ్రీన్‌కార్డుల కోసం లక్షలమంది భారతీయులు ఏండ్లుగా వేచి చూస్తున్నారు. ఇక, పౌరసత్వం రావడం పెద్ద కలగా మారింది. ఇప్పటివరకు పిల్లల పౌరసత్వంపై అయినా భరోసా ఉండేది. ఇప్పుడు అది కూడా పోయే ప్రమాదం నెలకొన్నది.