వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ప్రతినిధుల బృందంతో చైనా పర్యటనకు వెళ్లారు. అయితే డ్రాగన్ దేశంలో అడుగుపెడుతున్న ట్రంప్ టీమ్.. డిజిటల్ లాక్డౌన్లోకి వెళ్లనున్నది. ట్రంప్ బృందంలో ఉన్న అధికారులు, సెక్యూర్టీ సిబ్బంది.. తమ మొబైల్ ఫోన్ల అంశంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. చైనాలో హ్యాకింగ్ భయం ఎక్కువగా ఉన్నకారణంగా.. అమెరికా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఆ దేశానికి వెళ్లేవారు ఎవరైనా చాలా క్లీన్ డివైస్లతో వెళ్తారు. తాత్కాలిక ల్యాప్‌టాప్‌లు, నియంత్రిత కమ్యూనికేషన్ వ్యవస్థలతో చైనాలోకి ప్రవేశిస్తారు.
సైబర్ ప్రపంచంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో నిఘా, హ్యాకింగ్, డేటా సేకరణ జరిగే అవకాశం ఉన్న కారణంగా ట్రంప్ బృందం మొత్తం అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. తాత్కాలిక అకౌంట్ల ద్వార సమాచారాన్ని చేరవేసుకోనున్నారు. క్లౌడ్ యాక్సిస్ స్వల్పంగానే ఉంటుంది. కాంటాక్ట్స్ అన్నీ మాయం అవుతాయేమో అన్న భయం నెలకొన్నది. సాధారణ రీతికి భిన్నంగా డిజిటల్ వ్యవహార శైలితో నడుచుకోవాల్సి ఉంటుంది. చైనాలో ఉన్నంత కాలం.. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, హోటల్ వైఫైలతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఆదేశించారు.
ఎలక్ట్రానిక్ డివైస్‌లు కంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరించారు. చైనాలో సామూహిక నిఘా వ్యవస్థ ఉంటుందని సీక్రెట్ సర్వీస్ మాజీ ఏజెంట్ బిల్ గేజ్ తెలిపారు. ప్రతి అంశంలోనూ మానిటరింగ్ ఉంటుందన్న విషయాన్ని అధికారులకు చెప్పేశారు. ట్రంప్‌తో పాటు యాపిల్, బోయింగ్, క్వాల్కామ్, బ్లాక్‌రాక్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు కూడా చైనా వెళ్తున్న నేపథ్యంలో సైబర్ సెక్యూర్టీ, గూఢచర్యం, నిఘా లాంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
సాధారణంగా వాషింగ్టన్‌లోని చైనీస్ ఎంబసీకి వెళ్తే ఫోన్లను వదిలేసి వెళ్తారు. ఆ తరహాలోనే చైనాకు వెళ్లినా ఫోన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. డివైస్‌లు, నెట్‌వర్క్‌లు, హోటల్ రూమ్‌లు అన్నింటిలో అనుమానాలే ఉంటాయి. ఫోన్ ఛార్జింగ్ పెట్టినా అది సెక్యూర్టీ సమస్యగా మారే అవకాశం ఉన్నది. గుర్తు తెలియని యూఎస్బీ పోర్టులకు ప్లగింగ్ చేయవద్దు. ఛార్జింగ్ సమయంలో కంప్రమైజ్డ్ హార్డ్‌వేర్‌ను ఎక్కించే అవకాశాలు ఉంటాయని అనుమానాలు ఉన్నాయి.
డేటా సేకరణ కోసమో లేక వైరస్‌ను ఎక్కించే అవకాశాలు ఉన్నాయి. దీన్నే జూస్ జాకింగ్ అంటారు. హై రిస్క్ దేశాలకు వెళ్తున్న సమయంలో అధికారులకు అదనపు బ్యాటరీ ప్యాక్‌లను అందిస్తుంటారు. చైనాలో సురక్షితమైన ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ వ్యవస్థ లేదని గేజ్ అన్నారు. ఆ దేశంలో డిజిటల్ యాక్టివిటీని పరిమితం చేసుకోవాలి. ట్రంప్ పర్యటన వేళ అధికారులకు తాత్కాలిక డివైస్‌లను జారీ చేయనున్నామని తెలిపారు. చాలా నియంత్రిత పద్ధతిలో సేఫ్ జోన్లను ఏర్పాటు చేస్తారు, అక్కడ నుంచి అమెరికాలో అధికారులతో చర్చలు చేయవచ్చు.
ఇక సున్నిత మైన అంశాల గురించి చర్చించలానుకుంటే, అప్పుడు లాజిస్టిక్స్ ఏర్పాటు చేయడం మరింత కష్టంగా మారుతుంది. పేపర్ డాక్యుమెంటేషన్‌పై ఎక్కువగా ఆధారపడనున్నారు. ట్రంప్ బృందంలో వెళ్తున్న ప్రతి ఒక్కరిపై చైనా వ్యక్తిగతంగా నిఘా పెట్టనున్నది.