న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29 : భారతీయ సినీ పరిశ్రమకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాకిచ్చారు. అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా సోమవారం ప్రకటించారు. విదేశాలలోని పోటీదారులు అమెరికన్ సినీ వ్యాపారాన్ని కొల్లగొడుతున్నారని ట్రంప్ తెలిపారు. పసిబిడ్డ నుంచి చాక్లెట్ చోరీ చేసిన విధంగానే ఇతర దేశాలు అమెరికా సినీ నిర్మాణ వ్యాపారాన్ని చోరీ చేస్తున్నాయి అని ట్రంప్ ఆరోపించారు. బలహీన, అసమర్థ గవర్నర్ కారణంగా ప్రత్యేకంగా కాలిఫోర్నియా తీవ్రంగా నష్టపోయింది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎన్నటికీ పరిష్కారం కాని ఈ సుదీర్ఘ సమస్యను పరిష్కరించేందుకు అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ఏడాది మేలోనే విదేశీ సినిమాలపై భారీ సుంకాలు విధించే ఉద్దేశాన్ని ట్రంప్ సూచనప్రాయంగా వెల్లడించారు. విదేశీ సినిమాలపై భారీ సుంకాలు విధించే అంశాన్ని పరిశీలించాలని అమెరికా వాణిజ్య మంత్రిత్వశాఖకు, అమెరికా వాణిజ్య ప్రతినిధి(యూఎస్టీఆర్)కి ట్రంప్ అప్పట్లో ఆదేశాలు జారీచేశారు. అయితే ఆ సమయంలో ఆయన దీన్ని ఆర్థికపరంగానే గాక వ్యూహాత్మక చర్యగా భావించారు. అమెరికా సినీ పరిశ్రమ చాలా వేగంగా మరణిస్తోందంటూ కూడా ఆయన అప్పట్లో హెచ్చరించారు. అమెరికా సినీ నిర్మాణాన్ని మళ్లీ పట్టాలెక్కించాల్సిన అవసరం ఉందని, మళ్లీ అమెరికాలో సినిమాలు తీసే రోజులు రావాలని ట్రంప్ చెప్పారు. విదేశీ చిత్రాలపై సుంకాలు విధించడం వల్ల అమెరికా సినీ పరిశ్రమకు న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. ఇక్కడ పన్నులు ఎగవేసి చౌకగా విదేశాలలో సినిమాలను నిర్మించడానికి బదులుగా అమెరికా గడ్డపైనే సినిమా నిర్మాణాలు జరిగి ఇక్కడి స్టూడియోలు మళ్లీ పుంజుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అయితే ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం హాలీవుడ్‌కు సాయపడడానికి బదులుగా కష్టాలపాలు చేస్తుందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఖర్చులు తగ్గించుకునేందుకు డిస్నీ, పారమౌంట్, వార్నర్ బ్రదర్స్ తదితర అమెరికా స్టూడియోలు విదేశాలలో షూటింగ్ చేస్తున్నాయి. కొవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సినీ పరిశ్రమను ట్రంప్ తాజా నిర్ణయం మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద సినీ మార్కెట్ ఉన్న భారత్, చైనాతో వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వందశాతం టారిఫ్‌తో అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రపంచంలోనే అగ్రభాగంలో నిలబెట్టాలన్నది ట్రంప్ అభిమతం. అదే సమయంలో బడా నిర్మాణ సంస్థలను దారికితెచ్చుకోవాలనే ఆలోచన కూడా ఉంది. అయితే అమెరికాలో ఫిల్మ్ ప్రొడక్షన్ పరంగా ఉన్న మానవ వనరుల కొరత కారణంగా 100 శాతం టారిఫ్ అమలు అంత సులభం కాదనే మాటలు వినిపిస్తున్నాయి. కెనడా, బ్రిటన్, బల్గేరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తక్కువ వ్యయంతో చిత్రీకరణ పూర్తి చేయొచ్చు. అక్కడి ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ కారణంగా అగ్ర నిర్మాణ సంస్థలన్నీ ఆయా దేశాల్లో చిత్రీకరణకు మొగ్గుచూపుతున్నాయి. అయితే ఈ ధోరణి వల్ల అమెరికాకు పన్నుల పరంగా రాబడి తగ్గిపోతున్నది. స్థానిక కార్మికులకు కూడా ఉపాధి కరువవుతున్నది. బయటి దేశాల్లో షూటింగ్స్ చేస్తూ ఆ సినిమాలను అమెరికాలో విడుదల చేసి లాభాలను ఆర్జిస్తున్నారన్నది ట్రంప్ ప్రధాన ఆరోపణ. అందుకోసమే ఆయన 100% టారిఫ్‌పై పట్టుదలతో ఉన్నారని హాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.
ట్రంప్ తన ప్రకటనలో 100 శాతం టారిఫ్ అమలు గురించి ఎలాంటి విధివిధానాలు, కాలపరిమితిని వెల్లడించలేదు. దాంతో ఈ విషయంలో వేచిచూసే ధోరణిలో ఇండస్ట్రీ వర్గాలున్నాయి. విధివిధానాలు ఖరారైన తర్వాతే ఈ అంశంపై స్పష్టత వస్తుందంటున్నారు.
తెలుగు సినిమా ఓవర్సీస్ రెవెన్యూలో దాదాపు 80శాతం అమెరికా మార్కెట్ నుంచే వస్తుందన్నది ట్రేడ్ వర్గాల అంచనా. అగ్ర హీరోల చిత్రాలు అక్కడ భారీ వసూళ్లను సాధిస్తాయి. తెలుగు సినిమా మొత్తం రెవెన్యూలో అమెరికా నుంచి వచ్చే వాటా 30 శాతం వరకు ఉంటుందని చెబుతారు. ప్రస్తుతం అమెరికాలో తెలుగు సినిమా టికెట్స్‌పై 8 శాతం ట్యాక్స్ చెల్లిస్తున్నారు. సినిమా స్థాయిని బట్టి అక్కడ టికెట్ ధర 12-20 డాలర్ల మధ్య ఉంటుంది. ఒకవేళ వందశాతం టారిఫ్ అమలు చేస్తే ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లు ఏమాత్రం వర్కవుట్ కావని, టికెట్ ధరను రెండింతలు చేయాల్సి ఉంటుందని అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు. ఒకవేళ 100 శాతం టారిఫ్ అమలైతే అమెరికాలో తెలుగు సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వందశాతం టారిఫ్ కట్టుకుంటూ లాభాల్ని ఆర్జించాలంటే తెలుగు నిర్మాతలు తమ చిత్రాన్ని అతి తక్కువ ధరకు థియేట్రికల్ రైట్స్ అమ్మాల్సి ఉంటుంది. వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా అది అసంభవం. అలాంటప్పుడు యూఎస్‌లో సినిమా డిస్ట్రిబ్యూషన్‌కు ఎవరూ ముందుకురారని ట్రేడ్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.