Donald Trump : హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో ఇరాన్ ఓడరేవుల (Iran ports) పై అమెరికా (USA) దిగ్బంధనం కొనసాగుతోంది. ఇటీవల ఆ దేశానికి చెందిన నౌకల (Ships) ను యూఎస్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై దిగ్బంధనాన్ని అమలు చేయడంలో యూఎస్ నౌకాదళాలు సముద్రపు దొంగల్ (Pirates) లా పనిచేస్తాయని అన్నారు.
ఇరాన్ (Iran) పై కొనసాగుతున్న దిగ్బంధనం అమెరికాకు మంచి వ్యాపారమని ట్రంప్ అన్నారు. తాము నౌకలను సీజ్ చేశామని, సరకు, చమురును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇది అత్యంత లాభదాయకమైన వ్యాపారమని, తాము పైరేట్స్ లాంటి వాళ్లమని వ్యాఖ్యానించారు. తాము ఇరాన్‌తో ఆటలు ఆడటం లేదని, ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నామని అన్నారు. కాగా, అమెరికా దిగ్బంధనంవల్ల ఇరాన్‌కు దాదాపు 4.8 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ.45 వేల కోట్లకుపైగా) నష్టం వాటిల్లినట్లు పెంటగాన్ అంచనా వేసింది.
దిగ్బంధనం అమల్లోకి వచ్చినప్పటి నుంచి చమురుతో సహా ఇతర నిషేధిత సరకులను రవాణా చేసేందుకు ప్రయత్నించిన 40 కిపైగా నౌకలను యూఎస్ దళాలు దారి మళ్లించాయని పెంటగాన్ తెలిపింది. దాంతో సుమారు 53 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ ముడి చమురు తీసుకెళ్తున్న 31 ట్యాంకర్లు గల్ఫ్‌లోనే నిలిచిపోయాయని పేర్కొన్నది.