Donald Trump : గాజాలో శాంతిని నెలకొల్పడం కోసం ఇజ్రాయెల్-హమాస్ (Israel – Hamas) మధ్య కాల్పుల విరమణకు ఒప్పించిన అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కు.. ఇజ్రాయెల్ పార్లమెంట్ (Israel parliament) లో అరుదైన గౌరవం దక్కింది. ఎందుకంటే.. గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ తిరుగుబాటు సంస్థ తన వద్ద బందీలుగా ఉన్న 20 మంది ఇజ్రాయెల్ పౌరులను విడిచిపెట్టింది.
ఈ క్రమంలో బందీల విడుదలకు మూల కారణమైన ట్రంప్‌కు ఇజ్రాయెల్ పార్లమెంట్ జేజేలు పలికింది. బందీల విడుదల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు వెళ్లిన ట్రంప్ ప్రసంగించేందుకు అక్కడి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ పార్లమెంటేరియన్లు ఆయనకు సాదరస్వాగతం పలికారు. అందరూ లేచి నిలబడి కృతజ్ఞతగా కొన్ని నిమిషాలపాటు చప్పట్లు చరిచారు.
ట్రంప్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రపంచానికి మరింత మంది ట్రంప్‌లు అవసరం అంటూ ఆయనను ఆకాశానికెత్తారు. ఈ సందర్భంగా ట్రంప్‌తో.. తన స్పెషల్ ఎన్వాయ్ స్టీవ్ విట్కాఫ్, అల్లుడు జేర్డ్ కుష్నర్, కుమార్తె ఇవాంకా ఉన్నారు. కాగా జెరూసలేంలోని ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగం అనంతరం ట్రంప్.. కాల్పులు విరమణ ప్రణాళికను రూపొందించే ప్రక్రియలో పాల్గొనేందుకు ఈజిప్టుకు వెళ్లనున్నారు.