White house : అమెరికా అధ్యక్ష భవనమైన వైట్‌హౌస్ (White house) లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈస్ట్ వింగ్ (East wing) భవనాన్ని కూల్చివేసి, దాని స్థానంలో అధునాతన బాల్రూమ్ (Ballroom) ను నిర్మించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే సోమవారం నుంచి కూల్చివేత పనులు ప్రారంభం కాగా.. ఈ వారాంతానికి భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేయనున్నారని ఉన్నతాధికారులు తెలిపారు.
కొత్త బాల్రూమ్ నిర్మాణం కోసం సుమారు 250 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.2,000 కోట్లు) ఖర్చవుతుందని అంచనా. వాస్తవానికి వేసవిలో ఈ ప్రాజెక్టును ప్రకటించినప్పుడు ప్రస్తుత భవనానికి ఎలాంటి నష్టం వాటిల్లదని ట్రంప్ చెప్పారు. కానీ ఇప్పుడు పూర్తి భవనాన్ని కూల్చివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలను ట్రంప్ తోసిపుచ్చారు. తాము పారదర్శకంగా ఉన్నామని విలేకరులతో అన్నారు.
ఈ నిర్మాణం ఎప్పటినుంచో అవసరమని, దాదాపు 150 ఏళ్లుగా ఇలాంటి మార్పులు చేయాలని అనుకుంటున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లోని ఈస్ట్ వింగ్‌ను 1902లో నిర్మించారు. చివరిసారిగా 1942లో దీనికి మార్పులు చేశారు. ప్రథమ మహిళ కార్యాలయంతోపాటు ఇతర సిబ్బందికి, ప్రత్యేక కార్యక్రమాలకు ఈ విభాగాన్ని వినియోగిస్తుంటారు. భద్రత, సాంకేతికతను మెరుగుపరచడంలో భాగంగా ఈస్ట్వింగ్ను ఆధునికీకరించాలని మొదట భావించినప్పటికీ, ప్రణాళిక దశలో మొత్తం కూల్చివేయడమే ఉత్తమ మార్గమని తేలిందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
ఈ కూల్చివేత నిర్ణయంపై ‘నేషనల్ ట్రస్ట్ ఫర్ హిస్టారిక్ ప్రిజర్వేషన్’ అనే సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. వైట్‌హౌస్ ఒక జాతీయ చారిత్రక చిహ్నమని, కూల్చివేత పనులను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ అధికారులకు లేఖ రాసింది. డెమోక్రటిక్ పార్టీ నేతలు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. 2016 ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థిగా పోటీ చేసిన హిల్లరీ క్లింటన్.. వైట్‌హౌస్ ట్రంప్ ఇల్లు కాదని, ఆయన దాన్ని నాశనం చేస్తున్నారని తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
కాగా నూతన నిర్మాణానికి అయ్యే ఖర్చును తాను, తన స్నేహితులైన కొంతమంది దాతలు భరిస్తున్నామని ట్రంప్ స్పష్టంచేశారు. ఈ పనుల్లో సైన్యం కూడా పాలుపంచుకుంటోందని తెలిపారు.