Donald Trump | గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. ఇప్పుడు ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై పూర్తిగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelenskyy)తో ట్రంప్ భేటీ అయ్యారు. తోమహాక్ క్షిపణులు, ఇతర ఆయుధాల కోసం జెలెన్స్కీ అమెరికా చేరుకున్నారు. వైట్‌హౌస్ (White House)లో ట్రంప్‌తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా అక్కడ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. క్యాబినెట్ రూమ్‌లో జరిగిన లంచ్ మీటింగ్‌కి జెలెన్స్కీ స్టైలిష్ షూట్ (stylish jacket) ధరించి వచ్చారు. ఆ సూట్ అధ్యక్షుడి దృష్టిని ఆకర్షించింది. ‘ఈ జాకెట్ నిజానికి చాలా స్టైలిష్‌గా ఉంది. ఇందులో మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు’ అంటూ అధ్యక్షుడు కితాబిచ్చారు. అక్కడితో ఆగకుండా అవును, చాలా అందంగా.. అంటూనే ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.
అదేవిధంగా ఇరుదేశాలు వెంటనే యుద్ధం ముగించాలని ఈ సందర్భంగా ట్రంప్ పిలుపునిచ్చారు. జెలెన్స్కీతో సమావేశం చాలా ఆసక్తికరంగా, స్నేహపూర్వకంగా జరిగిందని తెలిపారు. ఇప్పటికే ఈ యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ట్రంప్ గుర్తు చేశారు. ఇక దీన్ని ముగించి శాంతి నెలకొల్పాలని పుతిన్, జెలెన్స్కీని కోరినట్లు వెల్లడించారు. ‘ఇకపై కాల్పులు, మరణాలు, అనవసరమైన భారీ ఖర్చులు వద్దు. నేను అప్పుడే అధ్యక్షుడిగా వుండి ఉంటే ఈ యుద్ధం మొదలయ్యేదే కాదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Also Read..
Pak Afghan Clashes | అఫ్ఘాన్‌పై పాక్ వైమానిక దాడులు.. ముగ్గురు క్రికెటర్లు సహా 10 మంది మృతి
జాబిల్లి ధూళే ఆవాసం!.. కష్టమేమీకాదని నాసా పరిశోధకులు