న్యూయార్క్: ముందు నుంచి చెబుతున్నట్లు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తన నిర్ణయాన్ని వెల్లడించేశారు. 2024లో జరగబోయే అమెరికా అధ్యక్ష రేసులో పోటీపడనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. వైట్‌హౌజ్ కోసం ఎన్నికల్లో నిలవనున్నట్లు అమెరికా ఎన్నికల సంఘం ముందు ట్రంప్ తన పత్రాలను సమర్పించినట్లు తెలుస్తోంది. అమెరికాను మళ్లీ గొప్ప స్థానంలో నిలిపేందుకు, వైభవంగా నిలిపేందుకు దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ప్రఖ్యాతిగాంచిన రిపబ్లిన్ పార్టీకి చెందిన ట్రంప్ 2016లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే గత ఎన్నికల్లో బైడెన్ చేతిలో ఆయన ఆ రేసులో ఓడిపోయారు. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్‌పై వ్యతిరేకత ఉన్నా.. 2024లో జరిగే దేశాధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. అభిమానుల ముందు ప్రసంగించడం చాలా ఈజీగా ఉందని, ఇలాంటి ప్రేమ ఉంటే వచ్చే ఎన్నికల్లోనూ తానే పోటీ చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు. దేశాన్ని ఛిద్రం చేస్తున్న రేడికల్ లెఫ్ట్ డెమోక్రాట్లను ఓడిద్దామని ఆయన అన్నారు.