Treasure : కొందరిని అదృష్టం గమ్ములా పట్టుకుంటుంది. వాళ్లు ఎలాంటి ప్రయత్నం చేయకున్నా లక్ష్మీదేవి తలుపుతడుతుంది. బికారిని బిలియనీర్‌ను చేస్తుంది. తాజాగా చెక్ రిపబ్లిక్ (Czech Republic) లోని ఈశాన్య పర్వతాల్లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ప్రకృతిని ఆస్వాదించడం కోసం హైకింగ్ (Hiking) కు వెళ్లిన ఇద్దరు పర్యాటకుల (Tourists) కు ఊహించని రీతిలో కోట్ల రూపాలయ విలువ చేసే నిధి (Treasure) దొరికింది.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. చెక్ రిపబ్లిక్‌లోని పోడ్కర్కోనోసి పర్వతాల్లో ప్రకృతి రమణీయతను వీక్షించేందుకు ఇటీవల ఇద్దరు పర్యాటకులు హైకింగ్‌కు వెళ్లారు. అలా వారు ముందుకు వెళ్తుండగా ఆ ప్రాంతంలో 598 బంగారు నాణేలు, ఆభరణాలు, పొగాకు సంచులు కాళ్లకు తగిలాయి. ఊహించని రీతిలో ఒక్కసారిగా అంత భారీ నిధిని చూసిన పర్యాటకులు ఆశ్చర్యపోయారు.
పర్యాటకులకు దొరికిన ఈ నిధి ప్రస్తుతం ఈస్ట్ బొహెమియన్ మ్యూజియంలో ఉంది. హైకర్స్‌కు ఆ నిధి ఫిబ్రవరి నెలలోనే దొరికినా.. ఈస్ట్ బొహెమియన్ మ్యూజియం మాత్రం ఆ విషయాన్ని ఇప్పుడు వెల్లడించింది. స్వాధీనం చేసుకున్న నాణేలు 1808వ సంవత్సరం నాటివిగా గుర్తించినట్లు తెలిపింది. ఫ్రాన్స్, బెల్జియం, ఒట్టోమాన్ సామ్రాజ్య కాలం నాటి ఆ నాణేలు 1921 తర్వాత ఎవరైనా దాచిపెట్టి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వందేళ్ల క్రితమే వాటిని భూమిలో దాచి పెట్టినట్లు అంచనా వేస్తున్నారు.
హైకర్స్ ఆ సంపదను చూపించినప్పుడు తాను ఎంతో ఆశ్చర్యపోయానని ఈస్ట్ బొహెమియన్ మ్యూజియం ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. వాటిని ఇంకా విశ్లేషించాల్సి ఉందని చెప్పారు. ఆ విలువైన లోహాల ప్రారంభ విలువే రూ.2.87 కోట్లు (3,40,000 డాలర్లు) గా ఉండవచ్చని అన్నారు. భూమిలో విలువైన వస్తువులను నిధుల రూపంలో నిల్వ చేయడం ప్రీహిస్టారిక్ సమయంలో ఒక ఆచారంగా ఉండేదని తెలిపారు. అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పుడు దానిని భూమిలో దాచి, తర్వాత తీసుకుందామనే ఉద్దేశం ఆ నిధి వెనుక కారణం కావొచ్చని ఆయన అంచనా వేశారు.
మరోవైపు రెండో ప్రపంచయుద్ధ సమయంలో నాజీలు ఈ నిధిని దాచి ఉండొచ్చన్న వాదనా ప్రచారంలో ఉంది. ఇదిలావుంటే నిధిని గుర్తించి తీసుకొచ్చిన పర్యాటకులకు ఏ లాభం అనే ప్రశ్న ఇప్పుడు చాలా మంది పాఠకుల్లో మెదిలి ఉంటుంది. అయితే అక్కడికే వెళ్దాం. చెక్ రిపబ్లిక్ చట్టాల ప్రకారం.. ఎవరికైనా ఏదైనా పురాతన కాలం నాటి నిధి దొరికితే ఆ నిధి విలువలో 10 శాతం వాళ్లకు దక్కుతుంది. ఆ లెక్క ప్రకారం వారికి దొరికిన నిధి ద్వారా హైకర్స్‌కు సుమారుగా రూ.28 లక్షల లబ్ధి చేకూరనుంది.