వాషింగ్టన్: ట్రాన్స్‌జెండర్ అయిన ఫ్లైట్ అటెండెంట్ కైలీ స్కాట్ (25) ఇకలేరు. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వాణిజ్య ప్రకటనలో కనిపించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆమె సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టి ప్రాణాలు తీసుకున్నారు. ఆమె కొలరాడోలోని తన ఇంట్లోనే గత సోమవారం మరణించారు. స్కాట్ తన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్లలో స్నేహితులు, కుటుంబసభ్యులకు హృదయవిదారక లేఖను రాశారు. ‘మనం పంచుకున్న మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి’ ఆ పోస్టులో కోరారు.
‘నేను నా తుదిశ్వాస తీసుకుంటూ, ఈ భూమి నుంచి నిష్క్రమిస్తూ.. ఆవేదనకు గురియ్యే ప్రతి ఒక్కరికీ క్షమాపణ చెబుతున్నాను’ అని స్కాట్ పేర్కొన్నారు. “నేను సరిగా మనలేకపోయినందుకు నన్ను క్షమించండి. నేను ఇష్టపడే వారికి.. నేను ధైర్యంగా ఉండలేకపోయినందుకు క్షమించండి. నా కోసం ఎన్నో ఇచ్చిన వారికి.. నేను చేసిన ప్రయత్నం ఫలించనందుకు క్షమించండి. నా మరణానికి మీరెవరూ కారణం కాదని అర్థం చేసుకోండి. నన్ను నేను సరిగా మార్చుకోలేకపోవడమే ఈ ఫలితం” అంటూ స్కాట్ భావోద్వేగంతో రాసుకున్నారు.
స్కాట్ తల్లి, ఆండ్రియా సిల్వెస్ట్రో తన కుమార్తె మరణవార్తను ధృవీకరించారు. ఫేస్బుక్ పోస్ట్‌లో “కైలీ స్కాట్.. నువ్వు నా కుమార్తెగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నా. నీ నవ్వు చాలా అందంగా ఉండేది. నీ హృదయం మాలో ఎవరికీ అర్థం కానంత పెద్దది” అని సిల్వెస్ట్రో రాసుకున్నారు. కాగా, స్కాట్ మరణంపై డెన్వర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు స్కాట్‌తో పనిచేయించుకున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఆమె మరణవార్త తెలిసి చింతిస్తున్నట్లు పేర్కొన్నది.