వాషింగ్టన్, నవంబర్ 13 : హెచ్-1బీ వీసా (H-1B Visa)కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వైఖరిలో మార్పు వచ్చిందని వార్తలు వెలువడుతున్న క్రమంలో ట్రంప్ కార్యనిర్వాహకవర్గ వైఖరిని ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బేసెంట్ వివరించారు. ఇక నుంచి హెచ్-1బీ వీసాపై వచ్చే విదేశీయులు ఇక్కడ ఉద్యోగాలు చేయరని, అమెరికన్లను శిక్షణ ఇవ్వడమే వారి ఉద్యోగమని, నిపుణులైన కార్మికులను అమెరికా రప్పించడం, అమెరికన్లకు వారితో శిక్షణ ఇప్పించడం, తర్వాత వారిని వారి దేశాలకు పంపడం ఇదే తమ కొత్త విధానం అని పేర్కొన్నారు. ‘ఇక్కడ అధ్యక్షుడి దార్శనికత ఏమిటంటే ఈ ఉద్యోగాలు ఎక్కడికి వెళ్లాయో, ఆయా నైపుణ్యాలు ఉన్న విదేశీ కార్మికులను తీసుకువచ్చి యూఎస్ కార్మికులకు శిక్షణ ఇప్పించిన తర్వాత మూడు, ఐదు, ఏడు సంవత్సరాల తర్వాత విదేశీ కార్మికులు ఇంటికి వెళ్లవచ్చు.
తర్వాత యూఎస్ కార్మికులే పూర్తి బాధ్యత తీసుకుంటారు’ అని ఆయన ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. విదేశీ కార్మికులపై దీర్ఘకాలికంగా ఆధారపడకుండా ఈ కొత్త విధానం నిరోధిస్తుందని, ఇకపై విదేశీయులకు తమ దేశంలో ఉద్యోగాలు ఉండవని ఆయన అన్నారు. అమెరికా గత 20-30 సంవత్సరాలుగా కొన్ని తయారీ రంగ ఉద్యోగాలను ఆఫ్ షోర్ చేసిందని, అందుకే రాత్రికి రాత్రే అమెరికన్లు నౌకలు ఎలా తయారు చేయాలో నేర్చుకోగలరా? అని ప్రశ్నించారన్నారు. తాము సెమీ కండక్టర్ పరిశ్రమను అమెరికాకు తేవాలనుకుంటున్నామని ఆయన చెప్పారు. గత కొన్ని ఏండ్లుగా నౌకలను నిర్మించడం లేదని, అలాగే సెమీ కండక్టర్లను తయారు చేయడం లేదని ఆయన తెలిపారు. అందుకే తాము విదేశీ భాగస్వాములను రప్పించి వారి ద్వారా అమెరికన్లకు శిక్షణ ఇప్పించిన తర్వాత వారి దేశాలకు తిరిగి పంపేస్తామని ఆయన చెప్పారు.