ఇస్లామాబాద్: ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్(Pakistan)లో జరుగుతున్న ఆందోళన హింసాత్మకంగా మారింది. తెహ్రీక్ ఈ లబ్బాయిక్ పాకిస్థాన్ మద్దతుదారులపై పాక్ సేనలు విరుచుకుపడ్డాయి. రాజధాని ఇస్లామాబాద్ వైపు దూసుకువస్తున్న ఆందోళనకారుల్ని అడ్డుకున్నారు. ఆ ఘర్షణల్లో ఓ ఆఫీసర్‌తో పాటు అనేక మంది నిరసనకారులు మరణించినట్లు తెలుస్తోంది. లాహోర్ సమీపంలో ఈ ఆందోళన జరిగింది. పంజాబ్ పోలీసు చీఫ్ ఉస్మాన్ అన్వార్ మాట్లాడుతూ.. భద్రతా దళాలపై ఆందోళనకారులు ఫైరింగ్ జరిపినట్లు పేర్కొన్నారు. దీంతో ఓ ఆఫీసర్ మృతిచెందినట్లు చెప్పారు. అయితే ఎంత మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారో చెప్పలేదు. టీఎల్పీ చీఫ్ సాద్ రిజ్వీ కూడా ఆ కాల్పుల్లో గాయపడినట్లు తెలుస్తోంది. అతనికి బుల్లెట్లు దిగినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నది.
ముర్దికే వద్ద జరిగిన కాల్పుల్లో ఓ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. టీఎల్పీ పార్టీ శుక్రవారం తమ ఆందోళనలు మొదలుపెట్టింది. ఇస్లామాబాద్‌లో ఉన్న అమెరికా ఎంబసీ ముందు గాజా, పాలస్తీనాకు అనుకూలంగా ప్రదర్శన చేపట్టాలని భావించింది. అయితే ఆదివారం పాకిస్థాన్ భద్రతా దళాలు.. ముర్దికే వద్ద టీఎల్పీ నిరసనకారుల్ని చుట్టుముట్టారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిరసనకారుల్ని తరలించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అక్కడ హింస చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.