వాషింగ్టన్ : (Fake gifts) అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సౌదీ రాజు నకిలీ బహుమతులు ఇచ్చారు. వీటిలో పులి, చిరుత చర్మంతో చేసిన దుస్తులు, మూడు కత్తులు, మూడు బాకులు, ఇతర ఖరీదైన బహుమతులు ఉన్నాయి. అయితే, పులి, చిరుత చర్మంతో చేసిన దుస్తులు నకిలీవని అమెరికా దర్యాప్తు సంస్థ విచారణలో తేలింది. నాలుగేండ్ల పాటు వైట్‌హౌస్‌లో రహస్యంగా దాచిన ఈ బహుమతులు నకిలీవిగా తేలడంతో ఇప్పుడు అటు ట్రంప్‌కు, ఇటు సౌదీ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. మూడు బాకుల్లో ఏనుగు దంతంతో తయారైన పిడి కలిగిన ఒక బాకు నిజమైనదేనా? అనే సందేహాలు వస్తున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ 2017 లో సౌదీ అరేబియా సందర్శించారు. ఆ సందర్భంగా సౌదీ రాజ కుటుంబం ట్రంప్‌తోపాటు ఆయన సహాయకులకు పలు విలువైన బహుమతులను అందించింది. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఈ బహుమతుల గురించి అప్పటి వైట్ హౌస్ అధికారులు సమాచారం ఇవ్వలేదు. ట్రంప్ అధ్యక్షుడిగా పదవీ విరమణ చివరి రోజున వైట్ హౌస్ ఈ బహుమతులను జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్‌కు అందజేసింది. యూఎస్ ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీసెస్.. ఇటీవల ఈ బహుమతులను స్వాధీనం చేసుకున్నది. పులి, చిరుత నమూనాలను అనుకరించేలా ఉన్న కోట్లకు రంగు వేసినట్లు వణ్యప్రాణి ఇన్స్పెక్టర్లు, ప్రత్యేక ఏజెంట్ల పరిశోధనలో తేలిందని ఇంటీరియర్ డిపార్ట్మెంట్ ప్రతినిధి టైలర్ చెర్రీ తెలిపారు. ఒకవేళ అవి నిజమైనవే అయితే, 1973 నాటి పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం ట్రంప్ ప్రభుత్వం అంతరించిపోతున్న జాతుల చట్టాన్ని ఉల్లంఘించిందనే ఆరోపణలు వచ్చే అవకాశం ఉన్నది.
ట్రంప్‌తో పాటు వైట్‌హౌస్ సలహాదారు జార్డ్ కుష్నర్ కూడా సౌదీ రాజు నుంచి బహుమతిగా రెండు కత్తులు, బాకులు అందుకున్నట్లు తెలుస్తున్నది. వీటికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఆరోజుల్లో ట్రంప్ ప్రభుత్వం వెల్లడించలేదు. పదవీ విరమణ తర్వాత వీటి కోసం ట్రంప్ రూ.36 లక్షలు చెల్లించినట్లు తెలుస్తున్నది.
ఇలాఉండగా, జీ7 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే విదేశీ నాయకుల కోసం తయారు చేసి విదేశాంగ శాఖ ఖజానాలో ఉంచిన కొన్ని బ్యాగులు కూడా కనిపించకుండా పోయినట్లు సమాచారం. కాగా, విదేశాంగ మాజీ కార్యదర్శి మైక్ పాంపియోకు ఇచ్చిన రూ.4.32 లక్షల విలువైన విస్కీ బాటిల్, భద్రతా సలహాదారు జాన్ బోల్టన్‌కు బహుమతిగా ఇచ్చిన బంగారు నాణేలు, పింగాణీ గిన్నెలు ఏమయ్యాయనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉండటం విశేషం.
ముచ్చటగా మూడోసారి ప్రధానిగా వాజపేయి
హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశించిన షుగర్.ఫిట్
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఆర్థరైటిస్… కీళ్లపై ప్రభావం.. ఇవి పాటిస్తే చాలు హాయి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..