స్టాక్‌హోం, అక్టోబర్ 14: ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది కూడా ముగ్గురిని నోబెల్ బహుమతి వరించింది. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేస్తున్న డారెన్ ఏస్‌మోగ్లు, సైమన్ జాన్సన్‌తోపాటు షికాగో యూనివర్సిటీలో పరిశోధన నిర్వహిస్తున్న జేమ్స్ ఏ రాబిన్సన్ ఈసారి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. చట్టబద్ధ పరిపాలన లేని సమాజాలు, ప్రజలను దోచుకునే వ్యవస్థలు స్థిరంగా ఎందుకు వృద్ధి చెందలేవన్న అంశంపై పరిశోధన నిర్వహించినందుకు వీరు ఈ పురస్కారానికి ఎంపికైనట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఆదాయ పరంగా దేశాల మధ్య ఉన్న భారీ అసమానతలను తగ్గించడం మన ముందున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటని, ఆ లక్ష్యాన్ని సాధించడంలో సామాజిక వ్యవస్థల ప్రాముఖ్యత ఏమిటన్న విషయాన్ని ఈ ముగ్గురు పరిశోధకులు తెలియజెప్పారని నోబెల్ పురస్కార కమిటీ చైర్మన్ జాకబ్ సెవెన్స్సన్ పేర్కొన్నారు.
చట్టాలను సక్రమంగా పాటించని సమాజాలు, ప్రజలను దోచుకునే వ్యవస్థలున్న దేశాలు అభివృద్ధిలో ఎందుకు విఫలమవుతాయో లోతుగా తెలుసుకునేందుకు వీరి పరిశోధన ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు. కాగా, నిరుడు కూడా అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై పరిశోధన చేసిన బెన్ ఎస్ బెర్నాంకీ, డగ్లస్ డబ్ల్యూ డైమండ్, ఫిలిప్ హెచ్ దిబ్విగ్ ఈ పురస్కారాన్ని గెలుచుకున్నారు.