US Shooting | అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగాయి. న్యూయార్క్‌లోని ఓ రెస్టారెంట్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. న్యూయార్క్ సిటీలోని బ్రూక్లిన్ హుక్కా లాంజ్, రెస్టారెంట్లోకి ఆదివారం ఉదయం 3.30 గంటలకు (స్థానిక కాలమాన ప్రకారం) పలువురు దుండగులు తుపాకులతో చొరబడ్డారు. అనంతరం అక్కడ ఉన్నవారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పురుషులు మృతిచెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. కాల్పుల గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలుస్తోంది.
కాగా, ఘటనాస్థలిలో 36 బుల్లెట్ శకలాలు లభించాయని పోలీసులు తెలిపారు. అలాగే ఘటనాస్థలికి కొంచెం దూరంలో రహదారిపై ఒక తుపాకీ దొరికిందని పేర్కొన్నారు. అయితే అది ఈ కాల్పుల్లో ఉపయోగించిందేనా? కాదా? అనేది స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. న్యూయార్క్ నగరంలో ఇలా కాల్పులు జరగడం ఈ నెలలో ఇది రెండోసారి. ఆగస్టు 9వ తేదీన టైమ్ స్క్వైర్ సమీపంలో ఒక టీనేజర్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు.