Ukraine | కీవ్, నవంబర్ 30 : సుమారు మూడేండ్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ముగిసే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ సైనికులు చాలామంది ‘బాబోయ్ ఈ యుద్ధం మాకొద్దు’ అంటూ యుద్ధభూమి నుంచి కాలికి బుద్ధి చెబుతున్నారు. ఒక పక్క కాల్పుల విరమణకు ప్రయత్నాలు సాగుతున్న క్రమంలో గట్టిగా తమ డిమాండ్లపై బేరం ఆడే స్థితిలో ఉక్రెయిన్ లేదని వారు భావిస్తున్నారు. 2022 ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 2 లక్షల మంది సైనికులు సైన్యం నుంచి పారిపోయినట్టు అంచనా. కొంతమంది విధులకు గైర్హాజరై పరారవ్వగా, మరికొందరు అనారోగ్య కారణాలతో సెలవులు పెట్టి తిరిగి విధుల్లోకి చేరకపోవడం తో వారి సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది. తమకు సరిపడా ఆయుధ సంపత్తి కూడా లేదని వారు అంటున్నారు. దీంతో భూతల దాడిలో ఆ దేశం మరింత బలహీనంగా మారుతున్నది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ విరమణకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒక కీలక ప్రతిపాదన చేశారు. కీవ్ ఆధీనంలో ఉన్న భూ భాగాన్ని నాటో పరిధిలోకి తెస్తే కాల్పుల విరమణకు తాను సిద్ధమేనని ప్రకటించారు. స్కైన్యూస్‌కు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘వేడిగా సాగుతున్న ఈ యుద్ధం దశను ఆపాలంటే మా నియంత్రణలో ఉన్న ఉక్రెయిన్ భూ భాగాన్ని నాటో పరిధిలోకి తేవాలి. అలా జరిగితేనే రష్యా ఆక్రమించుకున్న మా ప్రాంతాన్ని దౌత్యమార్గంలో సాధించుకోవచ్చు. మేము వేగంగా చేయాల్సిందే అదే’ అని పేర్కొన్నారు. అయితే నాటోలోని ఏ దేశం కూడా తమతో ఇలాంటి ప్రతిపాదన తీసుకురాలేదని అన్నారు. దేశంలోని ఒక భూ భాగానికి మాత్రమే రక్షణ ఏర్పాటు చేయడం నాటోకు కూడా కష్టమేనని పేర్కొన్నారు. తమను నాటోలో చేర్చుకోవడం కష్టమేనని, అలాంటి ప్రతిపాదనేదీ కూడా రాలేదన్నారు.
అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలకు తాన సిద్ధమేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన క్రమంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తెర పడవచ్చునని భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని ముగిస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు జెలెన్స్కీ కూడా కొత్త ప్రతిపాదనలతో కాల్పుల విరమణకు ఓకే చెప్పడంతో యుద్ధం ముగియవచ్చు.