Kindergartens | బీజింగ్: చైనాలో జననాల రేటు పడిపోవడంతో వేలాది కిండర్‌గార్టెన్స్ మూతపడుతున్నాయి. 2023లో 14,808 కిండర్‌గార్టెన్స్ మూతపడినట్లు చైనా విద్యా శాఖ వార్షిక నివేదిక వెల్లడించింది. వరుసగా మూడు సంవత్సరాల నుంచి కిండర్‌గార్టెన్‌లో చేరే చిన్నారుల సంఖ్య తగ్గిపోతున్నది. గత ఏడాది అంతకుముందు సంవత్సరం కన్నా 53.5 లక్షల మంది చిన్నారులు తగ్గిపోయారు. 2023లో 5,645 ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. చైనా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే మందగమనంలో ఉంది. జననాల రేట్లు మొత్తం జనాభాకు అనుగుణంగా లేవు. మరోవైపు వృద్ధుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో జనాభాలో అసమతుల్యత వల్ల భవిష్యత్తులో ఆర్థికాభివృద్ధి దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
పిల్లల్ని కనేందుకు విముఖత
చైనాలో ప్రస్తుతం వృద్ధులు ప్రభుత్వ సామాజిక భద్రత పథకాలపై ఆధారపడుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతున్నది. 2016లో ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడానికి దంపతులకు అనుమతి ఇచ్చారు. 2021లో దీనిని సవరించి ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడానికి అనుమతించారు. కానీ ధరల భారం భయంతో దంపతులు ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ఇష్టపడటం లేదు.