Covid-19 | డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ బారీన పడిన వారిలో దీర్ఘ కాలిక కొవిడ్ లక్షణాలతో బాధ పడే అవకాశాలు తక్కువేనని తేలింది. ఈ మేరకు జోయ్ కొవిడ్ యాప్ ఇచ్చిన వివరాల ఆధారంగా బ్రిటన్‌లోని లండన్ కింగ్స్ కళాశాల పరిశోధకులు చేపట్టిన అధ్యయనం ఈ సంగతి బయట పడింది. డెల్టా వేరియింట్తో పోలిస్తే బ్రిటన్‌లో ఒమిక్రాన్ భారీన పడిన వారిలో దీర్ఘకాల కొవిడ్ అభివృద్ధి చెందడానికి 20-50 శాతం అవకాశాలు తక్కువ అని పరిశోధకులు నిర్ధారించారు. రోగి వయస్సు, చివరి డోస్ తీసుకున్న సమయాన్ని బట్టి దీర్ఘ కాల కొవిడ్ లక్షణాలు మారుతున్నాయన్నారు.
గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య మహమ్మారి భారిన పడిన 56,003 మందిలో కేవలం 4.5 శాతం మంది మాత్రమే దీర్ఘకాల కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్లు తేలింది. గతేడాది జూన్-నవంబర్ మధ్య డెల్టా వేరియంట్ బారీన పడిన 41,361 మంది బాధితుల్లో 10.8 శాతం మంది దీర్ఘ కాలిక కొవిడ్ లక్షణాలతో బాధ పడ్డారని తేలింది. ఈ పరిశోధన వివరాలు `లాన్సెట్` జర్నల్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనం ఆధారంగా దీర్ఘ కాల కొవిడ్ రోగుల సంఖ్య తగ్గుతున్నట్లు కాదని పరిశోధకులు అభిప్రాయ పడ్డారు.
ఒమిక్రాన్‌తో దీర్ఘకాలిక కొవిడ్ లక్షణాల ముప్పు తక్కువగా ఉండటం మంచిదైనా దీర్ఘకాల లక్షణాలకు చికిత్స నిర్లక్ష్యం చేయొద్దని ప్రధాన పరిశోధకలు డాక్టర్ క్లయిర్ స్టీవ్స్ చెప్పారు. ఒమిక్రాన్ వేవ్ తర్వాత తమ దేశంలో 4.38 లక్షల మంది దీర్ఘ కాల కొవిడ్ లక్షణాలతో బాధపడుతన్నారని బ్రిటన్ పేర్కొంది. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేవ్ తర్వాత దీర్ఘకాల కొవిడ్ లక్షణాల ముప్పు తక్కువే ఉందని తెలిపింది. కానీ రెండు డోస్‌లు పూర్తి చేసుకున్న వారిలో మాత్రమే ఈ ముప్పు తక్కువ అని స్పష్టం చేసింది.