(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : ముకుకు అనేది కెన్యా దేశంలో ఉత్తర ప్రాంతంలోని ఓ కుగ్రామం. గత సోమవారం అక్కడి ప్రజలు.. నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకడానికి ఎంతో ఉత్సాహంగా సంబురాలకు సిద్ధమయ్యారు. ఇంతలో ఆకాశం నుంచి ఏదో ఉన్నట్టుండి పడ్డట్టు పెద్ద శబ్ధం వచ్చింది. ఊరి శివారు ప్రాంతంలో అది పడ్డట్టు గమనించిన గ్రామస్థులు.. ఏమిటా? అని అక్కడికి చేరుకొన్నారు. చూస్తే, ఓ పెద్ద ఇనుప ప్లేటు వారికి కనిపించింది. విషయాన్ని అధికారులకు చేరవేశారు. అక్కడికి చేరుకొన్న కెన్యా స్పేస్ ఏజెన్సీ (కేసీఏ) పరిశోధకులు.. భూ దిగువ కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఓ వాహకనౌకకు చెందిన మెటల్ భాగం ఆకాశం నుంచి కిందికి పడినట్టు వెల్లడించారు. మెటల్ బరువు 500 కిలోల వరకు ఉన్నట్టు తెలిపారు. అదివిన్న గ్రామస్థుల గుండెలు గుభేలుమన్నాయి. అంత బరువైన మెటల్ నెత్తిమీద పడితే తమ పరిస్థితి ఏమయ్యేదని ఆందోళన చెందారు. భూ దిగువ కక్ష్యలో అంతకంతకూ పెరిగిపోతున్న అంతరిక్ష వ్యర్థాలతో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి రావొచ్చని పరిశోధకులు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనను ‘కెస్లర్ సిండ్రోమ్’కు ఆరంభంగా అభివర్ణిస్తున్నారు.
భూ ఉపరితలం నుంచి 2 వేల కిలోమీటర్ల ఎత్తులో భూ దిగువ కక్ష్య ఉంటుంది. రోదసి ప్రయోగాల అనంతరం నిరుపయోగంగా మారిన వాహకనౌకలు, ఉపగ్రహ వ్యర్థాలన్నీ అక్కడే తిరుగుతాయి. ఆ కక్ష్యలో వ్యర్థాల సాంద్రత పరిమితికి మించి పెరిగినప్పుడు ఆయా శకలాల మధ్య చైన్ రియాక్షన్ జరుగుతుంది. దీంతో ఆ శకలాలు ఒకదానికొకటి ఢీకొని భూమి మీద పడతాయి. ఈ స్థితిలో రోదసి ప్రయోగాలకు భూ దిగువ కక్ష్య పనికిరాదు. దీన్నే కెస్లర్ సిండ్రోమ్గా పిలుస్తారు. కెన్యాలో జరిగిన ప్రమాదం ‘కెస్లర్ సిండ్రోమ్’కు ఆరంభంగా పలువురు చెప్తున్నారు.
గతంలో ఓ పనిచేయని ఉపగ్రహానికి చెందిన విడిభాగం తమ ఇంటిమీద పడిందని ఫ్లోరిడాకు చెందిన ఓ కుటుంబం గత ఏడాది నాసాపై దావా వేసింది. 3,200 కిలోల బరువున్న ఓ పనిచేయని ఉపగ్రహం అలస్కా-హవాయి మధ్యనున్న పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయినట్టు గత ఫిబ్రవరిలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. కాగా, అంతరిక్ష వ్యర్థాల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) ఇప్పటికే రెండుసార్లు ప్రమాదం ఎదురైంది.
ప్రస్తుతం భూ దిగువ కక్ష్యలో కాలం చెల్లిన శాటిలైట్లు, రాకెట్ల విడిభాగాలు, శిథిలాలతో కలుపుకొని మొత్తం 6 వేల టన్నుల బరువుగల వ్యర్థాలు తిరుగుతున్నాయి. ఈ అంతరిక్ష వ్యర్థాలు గంటకు సుమారు 18,000 మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదకరంగా మారాయి. ఈ వేగం బుల్లెట్ స్పీడ్ కంటే ఏడు రెట్లు ఎక్కువ. ఇంత వేగంతో ఈ వ్యర్థాలు భూమిమీద పడితే, సమస్త జీవజాలం అంతరించిపోవొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యర్థాలను తొలగించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్తున్నారు.