
న్యూఢిల్లీ, డిసెంబర్ 25: చైనా సర్వాధికారి షీ జిన్‌పింగ్ తిరుగులేని నాయకత్వం బీటలు వారుతున్నదా? ఎట్టకేలకు సవాళ్లు మొదలయ్యాయా? అంటే రాజకీయ పరిశీలకులు నిజమే అంటున్నారు. గతనెల జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ ముఖ్యమైన సమావేశానికి సంబంధించిన వార్తను అధికార పత్రిక పీపుల్స్ డెయిలీ ప్రచురించిన తీరుపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో నామమాత్రంగానైనా జిన్‌పింగ్ ప్రస్తావన లేకపోవడాన్ని ఎత్తిచూపుతున్నారు. సహజంగానే దీనిపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. జిన్‌పింగ్ ప్రస్తావన లేకపోవడమే కాకుండా చైనా సంస్కరణల రూపశిల్పి డెంగ్ షియావోపింగ్పై ప్రశంసలు కురిపించడం ఆ వార్తాకథనం ప్రత్యేకత. మార్కెట్ సంస్కరణల ద్వారా చైనాలో ఆర్థికవృద్ధి సాధించిన డెంగ్ మార్గాన్ని జిన్‌పింగ్ అధికారికంగా తిరస్కరించనప్పటికీ మావో మార్గంలో ఉక్కు పిడికిలి కింద వ్యక్తి నియంతృత్వ పాలన సాగించడం విమర్శలకు దారితీసింది. పీపుల్స్ డెయిలీ వార్తాకథనం రాసింది కమ్యూనిస్టుపార్టీ చరిత్ర, సాహిత్య పరిశోధనా సంస్థ అధిపతి కూ కింగ్‌షాన్ అధ్యక్షుని విధేయుడు కావడం గమనార్హం. జిన్‌పింగ్‌కు ముందు అధ్యక్ష పదవిని నిర్వహించిన జియాంగ్ జెమిన్, హూ జింటావ్ దేశాన్ని సరైనదారిలో నడిపిన డెంగ్ వారసత్వాన్ని కొనసాగించారని వ్యాసం మెచ్చుకోవడంపై కూడా విస్మయం వ్యక్తమవుతున్నది. అంటే జిన్‌పింగ్ ఆ కోవలోకి రాడని చెప్పకనే చెప్పినట్టు ఉందని అంటున్నారు. ఇదంతా డెంగ్ అనుయాయులు తమగొంతు బలంగా వినిపిస్తున్నారనడానికి సూచన అంటున్నారు పరిశీలకులు.