Bandages | న్యూయార్క్, ఏప్రిల్ 6: ఆడుకొనేప్పుడు పిల్లల మోచేతికి గాయమైనా, కూరగాయలు తరిగేటప్పుడు చేతి వేలు గీసుకుపోయినా.. ముందుగా గుర్తొచ్చేది ‘ఫస్ట్-ఎయిడ్’ బాక్స్‌లో ఉన్న బ్యాండేజీనే. అయితే, గాయాలు తగ్గడం కోసం ఉపయోగించే ఈ బ్యాండేజీల వల్ల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉన్నదని తేలింది. ఈ మేరకు హెల్త్ వెబ్సైట్ మమవేషన్, ఎన్విరాన్మెంట్, హెల్త్ న్యూస్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. పాలీఫ్లూరో ఆల్కైల్ సబ్‌స్టాన్సెస్ (పీఎఫ్ఏఎస్) అనే రసాయనాలు ఈ బ్యాండేజీలో ఉన్నట్టు తాము గుర్తించామని, వాతావరణంలో కరగనటువంటి ఈ కెమికల్స్‌తో ఆరోగ్య సమస్యలు పొంచి ఉన్నట్టు అధ్యయనకారులు వివరించారు.
పీఎఫ్ఏఎస్లను శాశ్వత రసాయనాలు అని కూడా పిలుస్తారు. ఇవి వాతావరణంలో కరిగిపోవు, కలిసిపోవు. ఈ రసాయనాలు వాడిన బ్యాండేజీలను గాయాలపై అతికించినపుడు, ఈ రసాయనాలు మెల్లిగా శరీరంలోకి వెళ్లి, కరిగిపోకుండా, అనేక సంవత్సరాలపాటు నిలిచిపోతాయి. తద్వారా ఆరోగ్యానికి హాని చేస్తాయి.
పీఎఫ్ఏఎస్ రసాయనాలు మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. ఇన్ఫెక్షన్లపై పోరాడే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. వ్యాక్సిన్లు ఇచ్చే ఫలితాలను తగ్గిస్తాయి. అంతేకాకుండా, బాలల గ్రహణ శక్తి, శారీరక, మానసిక వికాసంపై కూడా ప్రభావం చూపవచ్చు. సంతానోత్పత్తి సమస్యలకు దారి తీయవచ్చు. హార్మోనల్ సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లు, ఆరోగ్య సమస్యలకు ఈ రసాయనాలకు సంబంధం ఉందని మరికొన్ని పరిశోధనలు చెప్తున్నాయి.
పీఎఫ్ఏఎస్ రసాయనాలకు వాటర్‌ప్రూఫ్ లక్షణాలు ఉన్నాయి. వేడి, గ్రీజు, ఆయిల్, నీరు వంటివాటిని తట్టుకుని నిలవగలుగుతాయి. అందుకే వాటిని బ్యాండేజీల్లో వాడుతున్నారు. అఢెహెసివ్స్, నాన్‌స్టిక్ కుక్వేర్, ఫుడ్ ప్యాకేజింగ్‌లలో కూడా ఈ రసాయనాలు కనిపిస్తాయి.
అధ్యయనంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా18 బ్రాండ్లకు చెందిన సుమారు 40 బ్యాండేజీలను పరీక్షించారు. 26 బ్యాండేజీల్లో పీఎఫ్ఏఎస్ స్థాయులు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయని బయటపడింది. భారత్‌లో ఎక్కువగా అమ్ముడుబోయే బ్యాండ్-ఎయిడ్, క్యూర్యాడ్ బ్రాండ్లకు చెందిన బ్యాండేజీల్లోనూ పీఎఫ్ఏఎస్ రసాయనాలు వాడుతున్నట్టు అధ్యయనం వెల్లడించింది.